అమెరికా జాతీయ పక్షి అదే… 240 ఏళ్ల తర్వాత!
దాదాపు 240 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత అమెరికా జాతీయ పక్షిని ఖరారు చేశారు. ఎన్నో దశాబ్దాలుగా దానిని గుర్తుగా వాడుతున్నా, ఈ హోదా మాత్రం ఇప్పటివరకు లేదు. అదే ది బాల్డ్ ఈగిల్. అమెరికాను సూచించే చిహ్నంగా దీనిని ఏళ్ల తరబడి వాడుతున్నారు. ఇప్పటికి సెనెట్‌లో దీనిని అధికారిక పక్షిగా ఎంపిక చేసిన బిల్లుకు మోక్షం లభించింది. ఈ బిల్లును మిన్నెసోటాకు చెందిన డెమోక్రటిక్ పార్టీ సెనెటర్ అమీ క్లోబౌచెర్ ప్రవేశపెట్టారు. దీనిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా సెనెటర్ సిథియా లూమిస్ స్పందిస్తూ.. 240 ఏళ్లుగా అమెరికా విలువలకు ప్రతీకగా ది బాల్డ్ ఈగిల్ నిలిచింది. ఇప్పటికీ అది మన అధికారిక పక్షి కాలేకపోయింది. నేడు ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ బిల్లును మన బలమైన స్వేచ్ఛకు చిహ్నంగా ఆ పక్షి స్థానాన్ని మరింత బలోపేతం చేసింది అని పేర్కొన్నారు. లూమిస్ ఈ బిల్లును సహప్రాయోజకులుగా వ్యవహరించారు. సెనెట్‌లో బిల్లు ఏకగ్రీవంగా పాస్ కావడంతో త్వరలోనే దీనిని ప్రతినిధుల సభ ఆమోదించి, అధ్యక్షుడి సంతకంతో చట్టంగా రూపొందనుంది.







