TANA: తానా మహాసభల లోగో ఆవిష్కరణ
డిట్రాయిట్‌లోని నోవైలో జరగనున్న తానా (TANA) 24వ మహాసభలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని దస్ పల్లా హోటల్లో సెలబ్రిటీ మీట్ పేరుతో తానా నిర్వహించిన సమావేశం విజయవంతమైంది. ఈ సమావేశంలో తానా మహాసభల లోగోను, పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) మాట్లాడుతూ తానా వయసు నా వయసు ఒకటే అని చమత్కరించారు. తన వయస్సు కాదని, సినీరంగానికి వచ్చిన వయస్సు అని వివరించారు. మరో నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ తానా చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. అమెరికాలో తెలుగువారికి చిరునామాగా తానా ఉన్నదని చెప్పారు. సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ తానాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
గాయని సునీత మాట్లాడుతూ తానాతో తనది విడదీయరాని బంధం అన్నారు. మరో గాయని కౌసల్య కూడా తానా మహాసభల్లో తాను పాల్గొన్న మధురక్షణాలను గుర్తు చేశారు. హీరోయిన్ హెబ్బా పటేల్, నిర్మాత ఎస్కెఎన్, జబర్దన్స్ అభిరామ్, బిగ్‌బాస్ ఫేమ్ ఆదిత్య, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తానా కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ళ, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి, బోర్డ్ సభ్యురాలు లక్ష్మీదేవినేని, తానా కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పంట్ర, చందు గొర్రెపాటి తదితర తానా నాయకులతోపాటు శ్రేయోభిలాషులు ప్రసాద్ గారపాటి, పాతూరి నాగభూషణం, సాగర్ మారంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలోనే తానా మహాసభల పోస్టర్‌ను, తానా మహాసభల లోగోను విడుదల చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఏరోవిల్లాస్ సంస్థ స్పాన్సర్ చేసింది. మహాసభలకు మెయిన్ స్పాన్సర్‌గా ఈ సంస్థ ఉండనున్న సంగతి తెలిసిందే.







