ఆ 15 కంపెనీలకు దరఖాస్తు వద్దు : అమెరికా
హెచ్-1బి వీసాల దరఖాస్తులకు సంబంధించి అమెరికా కార్మిక విభాగం పలు సూచనలు చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేని 15 సంస్థల పేర్లను బుధవారం నాడు విడుదల చేసింది. ఈ జాబితా ఇండియాతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలు జాగ్రత్తగా పరిశీలించాలని సూచించింది. కావాలని పలుమార్లు ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీలుగా వీటిని గుర్తించి, ఆయా కంపెనీల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవద్దని హెచ్చరించింది. ఈ కంపెనీలపై దర్యాప్తు జరిపేందుకు సిద్ధమవుతున్నట్టు కార్మిక విభాగం తెలిపింది. విదేశీ ఉద్యోగులను తీసుకునే క్రమంలో కావాలని నిబంధనలు ఉల్లంఘించడం లేదా వివరాలు తప్పుగా సమర్పించిన కంపెనీలను ఈ జాబితాలో ఉంచుతామని లేబర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. హెచ్ 1 బి అనేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. దీని కింద ప్రత్యేక నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులను అమెరికా కంపెనీలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఏటా లాటరీ పద్ధతిలో 65వేల వరకూ హెచ్1 బి వీసాలను జారీ చేస్తారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్ 1 బి వీసాల జారీపై ఎన్నో ఆంక్షలు విధిస్తోంది.
అమెరికా విడుదల చేసిన 15 కంపెనీలు ఇవే :
ఏజెల్ టెక్నాలజీస్ (న్యూజెర్సీ), అమికా టెక్నాలజీ (కెంట్, వాషింగ్టన్), క్లిన్నార్ ఎల్ఎల్సి (షికాగో, ఇలినాయిస్), మాక్రో నెట్వర్క్స్ (న్యూయార్క్, కాలిఫోర్నియా), డెల్టా సెర్చ్ ల్యాబ్స్( కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్), ఎన్వైసి హెల్త్‌కేర్ స్టాఫింగ్ (న్యూయార్క్), ఫోస్కామ్ డిజిటల్(హుస్టన్, టెక్సాస్), జీ హెల్త్‌కేర్ ఎల్ఎల్సి (శాన్ జోస్, కాలిఫోర్నియా), ఇన్కాన్ కార్పొరేషన్ (సన్నీవేల్, కాలిఫోర్నియా), ఎండి2 సిస్టమ్స్ (వర్జీనియ), రీడ్స్ట్రా డైరీ లిమిటెడ్ (మెన్డాన్, మిషిగాన్), నిషె సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ (హుస్టన్, టెక్సాస్), నార్తర్న్ కాలిఫోర్నియా యూనివర్సల్ ఎంటర్ప్రైజ్ కార్పొరేషన్(శాన్ జోస్, కాలిఫోర్నియా), టెలవా నెట్వర్క్స్ (శాన్ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా), టెక్‌వైర్ సొల్యూషన్స్ (జెర్సీ సిటీ, న్యూజెర్సీ).













