పండ్ల రసంతో షుగర్ రాదు
నూటికి నూరు శాతం పండ్ల రసాలను తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ముప్పు లేదని జర్నల్ ఆఫ్ న్యూట్రిషినల్ సైన్స్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం పేర్కొంది. అవి ఆహారం తీసుకోకముందు రక్తంలో గ్లూకోస్, ఇన్సులిన్ లేదా ఇన్సులిన్ నిరోధకతపై ఎలాంటి గణనీయమైన ప్రభావం చూపవని తెలిపింది. నూటికి నూరు శాతం పండ్లరసం తీసుకోడానికి, రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు మధ్య సంబంధాన్ని అమెరికాలో రసాయనిక నియంత్రణ మరియు ఆహార భద్రత కేంద్రం పరిశోధకులు సమగ్రమైన డేటాను అధ్యయనం చేయడం ద్వారా అంచనా వేశారు. టైప్ 2 డయాబెటిస్ ఒక అపసవ్వమైన జీవప్రక్రియ. దీని వల్ల దేహం ఇన్సులిన్‌కు స్పందించదు. టైప్ 2 డయాబెటిస్‌ను నిరోధించడానికి మరియు నియంత్రించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి తొలి మెట్టు అవుతుంది. సకాలంలో ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా కసరత్తు చేయడం, ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండడం మంచిది. పండ్లు, కాయగూరలు, తృణధాన్యాలు, కొవ్వు శాతం తక్కువ ఉన్న పాల పదార్థాలు, రకరకాల ప్రొటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.













