Thammudu (2025) Review: సారీ… ‘తమ్ముడూ!’

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు – నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్, బేబీ శ్రీరామ్ దిత్య, తదితరులు
సంగీతం : అజనీష్ లోకనాథ్, సినిమాటోగ్రఫీ : కేవీ గుహన్
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్
రచన – దర్శకత్వం : శ్రీరామ్ వేణు
విడుదల తేది: 04.07.2025
నిడివి 2 ఘంటల 34 నిముషాలు
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో ఈ రోజు విడుదలైన చిత్రం “తమ్ముడు”. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. రాబిన్ హుడ్ సినిమా తర్వాత నితిన్ హీరోగా, వకీల్ సాబ్ తర్వాత శ్రీరామ్ వేణు తెరకెక్కించిన సినిమా కావడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. బాల్ ఎంత స్పీడ్‌కి కిందకి పడితే.. అంతే స్పీడ్‌గా పైకి వస్తుంది. ఈ సినిమాతో మళ్లీ నితిన్‌కి మంచి సక్సెస్ రాబోతుంది అని నిర్మాత దిల్ రాజు చాలా ధీమాగా చెప్పారు. మరి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన తమ్ముడు ప్రేక్షకులను ఎంతవరకు అలరించింది అనేది సమీక్షలో చూద్దాం.
కథ:
అక్క ఝాన్సీ (లయ) సమస్య కోసం తమ్ముడు చేసిన వీరోచిత పోరాటం ఈ కథ. ఆర్చరీలో దేశానికి గోల్డ్ మెడల్ సాధించాలనేది జై (నితిన్) ఆశయం. అందుకోసమే చిన్నప్పటి నుంచి కష్టపడి విలువిద్యలో శిక్షణ తీసుకుంటాడు. ఎలాగైనా దేశానికి గోల్డ్ మెడల్ తేవాలి, కానీ బుల్స్ ఐ కొట్టడంలో ప్రతిసారి మిస్ అవుతూ ఉంటాడు. మీలో ఏదో సమస్య ఉంది ముందుగానే పరిష్కరించుకున్న తర్వాత లక్ష్యం వైపు ఆలోచించు అని కోచ్ చెప్పిన మాటలు విన్న తర్వాత.. పరిష్కారం కోసం బయలుదేరుతాడు జై. అలా తన అక్క ఝాన్సీ కు చిన్నప్పుడు చేసిన అన్యాయం గుర్తుకొస్తుంది. ప్రేమ పెళ్లి చేసుకుని కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయిన అక్కని వెతుక్కుంటూ వెళ్తాడు. తన అక్క ఝాన్సీ జీవితంలో జరిగిన గతం తనని వెంటాడటమే తన లక్ష్యసాధనలో వెనుకబడటానికి కారణం అని తెలుసుకుంటాడు. అతను వెళ్లేసరికి అక్క కుటుంబం ప్రమాదంలో ఉందని తెలుసుకొని.. ఆమె ఇచ్చిన మాట కోసం ప్రాణాన్ని సైతం ఫణంగా పెడతాడు.అయితే ఝాన్సీతో పాటు ఆమె కుటుంబం మొత్తాన్ని ఓ ఫ్యాక్టరీ ఇష్యూలో చంపేయాలని అనుకుంటాడు అజర్వాల్ (సౌరభ్ సత్యదేవ్). ఆ దుర్మార్గుడి నుంచి తన అక్క ప్రాణాలను కాపాడానికి జై చేసిన పోరాటం ఏంటి? అతనికి చిత్ర (వర్ష బొల్లమ్మ), రత్న (సప్తమి గౌడ) చేసిన త్యాగం ఏంటి? చివరికి అక్కా తమ్ముళ్లు బంధం ఏవిధంగా బలపడింది అన్నదే మిగిలిన కథ.
నటీనటుల హవబావాలు:
నితిన్ నటన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఏ పాత్ర ఇచ్చినా కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూ ఉంటాడు. కాకపోతే కథలు వర్కౌట్ కానప్పుడు అతను మాత్రం ఏం చేస్తాడు. హీరో తర్వాత అత్యంత కీలకమైన పాత్ర లయ పోషించింది. లయ, నితిన్ మధ్య బాండింగ్ బాగా కుదిరింది. లయ అక్క పాత్రకు ఆమె ప్రాణం పోసింది. మరో చిన్న పాప క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఎమోషనల్ సీన్లు లేకపోవడం వల్ల , గొప్పగా సినిమాలో కంటెంట్ ప్రొజెక్ట్ కాలేకపోవడం వలన లయ, నితిన్ల కాంబినేషన్ వర్కవుట్ కాలేదు. నితిన్ మెచ్యుర్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు అంతే! లయ అందం, అభినయంతో ఆకట్టుకొన్నారు. ఇక హీరోయిన్స్ వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ తమ పాత్రలకు న్యాయం చేశారు. స్వసిక నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో కొత్తదనం తీసుకొచ్చారు. హరితేజకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర లభించింది. సౌరబ్ సచ్ దేవా ఓ గమ్మత్తైన పాత్రలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో మెప్పించే ప్రయత్నం చేశారు. మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు :
దర్శకుడు శ్రీరామ్ వేణు ఇంతకు ముందు తీసిన సినిమాలకు ఈ సినిమాకి తేడా ఏంటనేది తమ్ముడు సినిమాతో చూపించబోతున్నాడని దిల్ రాజు అన్నారు. కానీ.. తమ్ముడు సినిమా చూసిన తరువాత. ఆయన గత చిత్రాలు ఎంసీఏ, వకీల్ సాబ్‌లే బెటర్ అనిపిస్తాయి. వేణు శ్రీరామ్ కథ మాత్రమే కాదు.. స్క్రీన్ ప్లే కూడా పాతదే రాసుకున్నాడు. ఈ సినిమాకు ప్రధానమైన బలం సంగీతం అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ బాగుంది. కొన్ని సీన్లను సౌండ్‌తో కేక పెట్టించాడు. సన్నివేశాల్లో కంటెంట్ లేకపోవడం వల్ల తను కూడా ఏమీ చేయలేకపోయాడు. ఈ మూవీకి సేదు, సమీర్ రెడ్డి, గుహన్ ఇలా ముగ్గురు బడా కెమెరామెన్స్ పనిచేశారంటే విజువల్ రిచ్ నెస్ కోసమే. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ప్లస్ అయ్యింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఈ సినిమాకు మైనస్. సెకండాఫ్‌లో చాలా అనవసరమైన సీన్లు ఉన్నాయి. వాటిని కట్ చేసి ఉంటే.. కొంత ఫీల్ అయినా మిగిలి ఉండేదేమో? ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దిల్ రాజు మూవీ అంటే కథ, కథనాలు పకడ్బందీగా ఉంటాయి. కాని ఈ సినిమా విషయంలో కొంత ల్యాగ్ కనిపించింది.
విశ్లేషణ :
వైజాగ్‌లోని కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది. అయితే బాధితులకు నష్టపరిహారం చెల్లించుకుండా తప్పించుకోవాలని చూసిన అజర్వాల్ పాయింట్‌తో కథ ఎమోషనల్‌గా మొదలవుతుంది. ఆ పాయింట్ ఆధారంగా చేసుకొని అక్కా, తమ్ముడి కథను లింక్ చేసిన తీరు కూడా బాగుంది. కానీ కథలోని సన్నివేశాలు, కథనం చాలా రెగ్యులర్, రొటీన్‌గా ఉంది. ఈ సినిమాలో ఎమోషన్స్ అసలు పండలేదు. బ్రదర్, సిస్టర్ మధ్య ఉన్న డ్రామాలో భావోద్వేగాలు పండించడానికి చాలా స్కోప్ ఉంది. కానీ సరైన రీతిలో కథ, కథనాలు, సన్నివేశాల రూపకల్పనలో సరిగా కసరత్తు జరగలేదనే విషయం ఆరంభంలోనే అర్ధమవుతుంది. కానీ ఈ లోపాలను టెక్నికల్ అంశాలు, అటవీ ప్రాంతంలోని టేకింగ్‌తో సరిపెట్టుకొనే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు.ఇక సెకండాఫ్‌లోనైనా అక్కా, తమ్ముడి మధ్య ఎమోషనల్ బాండింగ్‌తో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందా? అని వేచి చూసిన వారికి నిరాశే ఎదురవుతుంది.
నిజానికి శ్రీరామ్ వేణు చిత్రాల్లో ఉమెన్ క్యారెక్టర్స్ చాలా బలంగా ఉంటాయి. కానీ.. ఇందులో లయ పాత్ర కూడా తేలిపోయింది. పోనీ నితిన్ పాత్ర ఏదైనా గొప్పగా ఉందంటే.. అక్క కోసం నిలబడే తమ్ముడు. అతనికి చెప్పిన పనిని చెప్పినట్టు.. వచ్చిన పనిని నచ్చినట్టు గత చిత్రాల మాదిరే చేసుకుంటూ వెళ్లిపోయారు. విక్రమ్‌లో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కథతో ఎలా ట్రావెల్ అవుతుందో తమ్ముడు సినిమాలో నితిన్ పాత్ర కూడా అలాగే ఉంటుందని చెప్పిన దర్శకుడు. నిర్మాత శిరీష్ చెప్పినట్టు మొదటి 15 నిమిషాల తర్వాత సినిమా మొత్తం ఒక రోజులో జరిగే కథ. ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే చాలా పకడ్బందీగా ఉండాలి. కాని అది జరుగలేదు. ఫ్యామిలీ సెంటిమెంట్‌ని సరిగా వర్కౌట్ చేయలేదు. బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య సోల్ మూవీ అయినప్పుడు.. అసలు వాళ్లిద్దరి మధ్య ఒక్కటంటే ఒక్క సెంటిమెంట్ సీన్ పండింది లేదు. పోనీ ఇది రొటీన్ ఫార్మేట్ కాదని అనుకుందామంటే.. కథలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. ఈ విషయంలోనే వేణు శ్రీరామ్ పూర్తిగా మిస్ ఫైర్ చేశాడు. ఇందులో ఒక డైలోగ్ వుంది “అనుగక్షతి ప్రవాహః” అని.. అంటే Go with the flow అని అర్థం. ‘దారి ఎటు చూపిస్తే అటు వెళ్లిపో!’ అని అర్ధం మరి ఈ చిత్రంలోని కథ కథనాలు కూడా వాటి ఇష్టం వచ్చినట్లుగా అవి వెళ్ళిపోయాయి అనుకుంటా! నితిన్ ఫ్యాన్స్, సిస్టర్ సెంటిమెంట్ తరహా సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది. సారీ తమ్ముడూ!!