Mad Square: ఎంటర్‌టైన్మెంట్ కి చక్కటి ఆప్షన్ ‘మ్యాడ్ స్క్వేర్’

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్
నటినటులు : సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ
సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ : శామ్‌దత్ ISC
ఎడిటర్ : నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
స్క్రీన్ ప్లే: ప్రణయ్ రావు తక్కళ్లపల్లి, ఆర్ట్ : పెనుమర్తి ప్రసాద్ M.F.A
ఫైట్ మాస్టర్: కరుణాకర్, సమర్పణ: సూర్యదేవర నాగ వంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
విడుదల తేదీ: 28.03.2025
బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. టీజర్ లోని సంభాషణలు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మ్యాడ్ మూవీతో మంచి హిట్ ఖాతాలో వేసుకొన్న తొలి చిత్ర దర్శకుడు కల్యాణ్ శంకర్ సీక్వెల్ కి కూడా ఆయనే డైరెక్ట్ చేసాడు. శ్రీకర్ స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ రోజు మార్చి 28న ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం థియేటర్లలో విడుదల అయ్యింది. మరి తొలి చిత్రం వలే మ్యాడ్ స్క్వేర్ ప్రేక్షకులు మరో శారి ఆదరించారా? లేదా? అన్నది సమీక్షలో చూద్దాం.
కథ:
ఇంజినీరింగ్ స్టడీస్ ముగించుకొన్న మనోజ్, అశోక్, దామోదర్ (నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్) తమకు నచ్చిన పని చేసుకొనే పనిలో ఉంటారు. అయితే ఫ్రెండ్ లడ్డూ అలియాస్ గణేష్ (విష్ణు) పెళ్లి చేసుకొంటున్నాడనే విషయం తెలుస్తుంది. తమను పెళ్లికి పిలవకపోయినా లడ్డూ పెళ్లికి ముగ్గురు వెళ్తారు. ఆ పెళ్లిలో జరిగిన అనేక నాటకీయ సంఘటనల నేపథ్యంలో లడ్డూ పెళ్లి ఆగిపోతుంది. పెళ్లి కూతురు లేచిపోతుంది. ఊహించినట్టే లడ్డూ పెళ్లి ఆగిపోతుంది. పెళ్లి ఆగిపోయినా తన ముగ్గురు స్నేహితులతో కలిసి లడ్డూ గోవాకు హనీమూన్‌కు వెళ్తారు. లడ్డూ తన పెళ్లికి మనోజ్, అశోక్, దామును ఎందుకు పిలువలేదు. పిలువని పేరంటానికి వెళ్లిన ఆ ముగ్గురు ఏం చేశారు? పెళ్లి ఏ పరిస్థితుల్లో ఆగిపోయింది? పెళ్లి ఆగిపోయిన తర్వాత వారంతా కలిసి హానీమూన్‌కు ఎందుకు వెళ్లారు? గోవాలోని మ్యూజియంలో గోల్డ్ చైన్ దొంగతనం కేసులో ఈ నలుగురు ఎలా ఇరుక్కుపోయారు? గోవాలో లడ్డూ తండ్రి (మురళీధర్ గౌడ్)ను భాయ్ (సునీల్) ఎందుకు కిడ్నాప్ చేశారు? గోవాలో కలిసిన లైలా ఎవరు? లైలా( ప్రియాంక జువాల్కర్) కోసం అందరూ ఎందుకు వెతికారు? చివరికి గోల్డ్ చైన్ దొంగతనం కేసు ఏమైంది. లడ్డూ తండ్రిని ఎలా విడిపించారు? ఈ కథలో అశోక్ కుమార్ (నార్నే నితిన్) రోల్ ట్విస్ట్ సినిమాకు ఎలా ఉపయోగపడింది? అనే ప్రశ్నలకు సమాధానమే మ్యాడ్ స్క్వేర్ సినిమా కథ.
నటీనటుల హవబావాలు:
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరియు విష్ణు ఓఐ తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సంతోష్ శోభన్ డీసెంట్ లుక్స్ అండ్ నీట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. నార్నే నితిన్ కూడా మంచి నటనను కనబరిచాడు. అలాగే, విష్ణు ఓఐ, రామ్ నితిన్ తమ ఈజ్ కామెడీ టైమింగ్ తో ఇంప్రెస్ చేసారు. ఇతర కమెడియన్స్ గా సత్యం రాజేష్, మురళీధర్ గౌడ్, నటుడు రఘుబాబు బాగానే నవ్వించారు. ఈ మ్యాడ్ బ్యాచ్ అనుకోని సంఘటనలతో చిక్కుకునే సన్నివేశాలు.. అలాగే ఆ సమస్యల నుంచి వీరు తప్పించుకోవడానికి ప్రయత్నించే సన్నివేశాలు బాగా అలరిస్తాయి. ఆ సన్నివేశాల్లో అందరి నటన చాలా బాగుంది. హీరోయిన్ గా నటించిన ప్రియాంక జావల్కార్ కూడా ఆకట్టుకుంది. తన గ్లామర్ తో పాటు తన నటనతోనూ ఆమె మెప్పించింది.
సాంకేతిక వర్గం పనితీరు:
మ్యాడ్ మూవీతో మంచి హిట్ ఖాతాలో వేసుకొన్న తొలి చిత్ర దర్శకుడు కల్యాణ్ శంకర్.. తన మలిప్రయత్నంలో ఆ సినిమాకే సీక్వెల్ చేసి తన జోనర్‌పై ఎలాంటి పట్టు ఉందో అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. తాను కొత్త కథ, కథాంశాలు ఏమి ఎంచుకోలేదు కానీ యూత్ కి కావాల్సిన ఓ ఎంటర్టైనర్ ని ఇవ్వడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. కథ విషయంలో పెద్దగా స్కోప్ లేని చిన్న పాయింట్ తీసుకొని.. దాని చుట్టు అల్లుకొన్న సన్నివేశాలే ఈ సినిమాకు అత్యంత బలంగా మారాయి. భీమ్స్ మ్యూజిక్ బాగుంది. ఆయన మార్క్ సాంగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక షామ్ దత్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్, డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఈ చిత్రంలో మేకర్స్ పెట్టిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కించి అందించారు.
విశ్లేషణ:
ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే రెండున్నర గంటల వినోదాన్ని ఆస్వాదించవచ్చనే విషయాన్ని మ్యాడ్ స్క్వేర్ ద్వారా చెప్పడమే కాకుండా మెప్పించే ప్రయత్నం కూడా బాగా చేశారు.ముందు చెప్పినట్టుగానే నాన్ సెన్స్ కామెడీ మూవీ. అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా సన్నివేశాలు ఉండటం ఈ సినిమా ప్లస్ పాయింట్. ఎలాంటి అంచనాలు లేకుండా.. యూత్ ఫుల్ కామెడీ మూవీని ఎంజాయ్ చేయాలనుకొనే వారికి ఈ వారం థియేటర్‌లో ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటింది. కేవలం యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ కూడా ఆస్వాదించే లాజిక్ లెస్ ఫన్ ఉంటుంది. కేవలం ఎంటర్‌టైన్ అవుదామని అనుకొనే వారికి మ్యాడ్ స్క్వేర్ చక్కటి ఆప్షన్ అని చెప్పొచు..