Kannappa: ‘కన్నప్ప’గా విష్ణు సర్‌ప్రైజ్ నటన! క్లైమాక్స్ అదిరింది!!

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థలు : 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు : మంచు విష్ణు, ప్రీతి ముకుందన్, ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్,
కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, బ్రహ్మానందం, కౌశల్ మంద, మధుబాల, శరత్ కుమార్ తదితరులు
సంగీతం : స్టీఫెన్ డావెస్సి, సినిమాటోగ్రఫీ : షెల్డన్ చావ్
ఎడిటర్ : ఆంథోని, నిర్మాత : Dr. మంచు మోహన్ బాబు
దర్శకుడు : ముఖేష్ కుమార్ సింగ్
విడుదల తేది :27.06.2025
నిడివి : 3 ఘంటల 15 నిముషాలు
టాలీవుడ్‌లో దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో మంచు విష్ణు కన్నప్ప (Kannappa) పాత్రలో నటించారు. డాక్టర్ మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి స్టార్ క్యాస్టింగ్ ఈ చిత్రంలో ఉంది. నిజానికి ఈ సినిమా మొదలైనప్పుడు ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో చాలా మంది ఈ చిత్రంపై నెగెటివిటీ క్రియేట్ చేశారు. కాని ‘శివా శివా శంకర’ పాట వినగానే, చూడగానే ఆ ట్రోల్స్ అన్నీ పటాపంచలు అయిపోయాయి. కన్నప్ప.. ఈ పేరు వినగానే మన కళ్ల ముందు ఒక సీన్ గుర్తొస్తుంది. శివుడిపై తన భక్తిని, నిస్వార్థమైన ప్రేమని చాటేందుకు తన రెండు కళ్లు అర్పించిన గొప్ప భక్తుడు మనకి గుర్తొస్తాడు. నిజానికి కన్నప్ప కథ గురించి తెలియని వాళ్లు ఎవరూ లేరు. ఎందుకంటే ఆయన చరిత్రపై కన్నడ రాజ్ కుమార్ ‘శ్రీకాళహస్తి మహత్యం’ కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’చిత్రాలు బ్లాక్ బస్టర్ చిత్రాలుగా సినిమా చరిత్రలో నిలిచిపోయాయి. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు నిర్మించిన చిత్రం కన్నప్ప. విష్ణు మంచు కథ, స్క్రీన్ ప్లే అందించగా, ఈ సినిమాను మహ భారతం సీరియల్‌కు వర్క్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు…ప్రస్తుతం న్యూ ఏజ్ మూవీ గా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. సినిమా ఎలా వుందో సమీక్షలో చూద్దాం.
కథ :
2వ శతాబ్దంలో నడిచే ఈ కథ కాళహస్తి ప్రాంతంలో ఓ ఐదు తెగలలో ఒకదానికి చెందిన తిన్నడు (మంచు విష్ణు)(Manchu Vishnu) . గూడెంలో జనాలంతా ఎలాంటి సమస్యలు లేకుండా చల్లగా ఉండాలంటే అమ్మవారికి నరబలి ఇవ్వాల్సిందే అంటూ అంతా నమ్ముతుంటారు. అలా చిన్నప్పుడే తన స్నేహితుడ్ని బలి ఇవ్వడం చూసి తిన్నడు కదిలిపోతాడు. అసలు దేవుడే లేడు.. అది ఒట్టి రాయి మాత్రమే అంటూ అప్పటి నుంచి నాస్తికుడిగా మారతాడు. పెద్దైన తర్వాత కూడా తిన్నడు మారడు. మరో పక్క ఆ దగ్గరలోనే ఉండే వాయు లింగంకి వంశపారంపర్యంగా మహాదేవ శాస్త్రి (మోహన్ బాబు)(Manchu Mohanbabu) ఎంతో గోప్యంగా ఉంచుతూ తానే మహాశివునికి పరమ భక్తుడిని అనే భావనతో ఉంటాడు.అయితే ప్రశాంతంగా ఉంటున్న తమ అడవి మీద.. ఉన్న ఐదు గూడాల మీద.. ఆ లోపల ఉన్న వాయులింగం (ప్రస్తుత శ్రీ కాళహస్తి శివలింగం) మీద కాలాముఖుడు (అర్పిత్ రాంకా) (Arpith Ranka)అనే ఓ దుర్మార్గుడి కన్నుపడుతుంది. ఆ వాయులింగాన్ని దక్కించుకుంటే సర్వశక్తులు వస్తాయనే ఉద్దేశంతో దాని ఆచూకీ కోసం తన తమ్ముడ్ని పంపిస్తాడు కాలాముఖుడు.
అయితే కాలాముఖుడు తమ్ముడ్ని తిన్నడు ఒక గొడవలో చంపేస్తాడు. దీంతో తిన్నడిని చంపి ఆ గూడేలు అన్నింటినీ తుడిచిపెట్టేయాలని తన సర్వ సైన్యంతో కాలాముఖుడు పగతో వస్తాడు. మరి అప్పటివరకూ తమ మధ్య ఉన్న గొడవలతో వేరుగా ఉన్న ఐదు గూడాలు.. కాలాముఖుడ్ని ఎదిరించడానికి ఏకమవుతాయి. తమ నాయకుడిగా తిన్నడ్నే ఎంచుకుంటాయి. కానీ తర్వాత అనుకోని కారణాల వల్ల తిన్నడిని తన తండ్రి నాథనాథుడు గూడెం నుంచి వెలివేస్తాడు. అసలు అలా ఎందుకు చేశాడు..? నాస్తికుడైన తిన్నడు మహా శివభక్తుడిగా ఎలా మారాడు అన్నదే మిగిలిన కన్నప్ప కథ.ఇక తిన్నడు మహా శివభక్తుడిగా మారేందుకు రుద్ర (ప్రభాస్)(Prabhas) చేసిన సాయమేంటి. అక్కడి నుంచి శివుడుకి (అక్షయ్ కుమార్)(Akshay Kumar) మహా భక్తుడిగా తిన్నడు ఎలా మారాడు. ఇందుకు కారణమైన పరిస్థితులేంటి? అసలు ఈ కథలో కిరాటా (మోహన్ లాల్)(Mohan Lal) పాత్రలు ఏంటి అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
నటీ నటుల హవభావాలు :
కన్నప్ప సినిమా పై ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి ప్రధాన కారణం ప్రభాస్ ఉన్నదనే కారణం. కానీ థియేటర్‌కి వచ్చిన జనాల్ని తన నటనతో సర్‌ప్రైజ్ చేశాడు విష్ణు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్‌లో విష్ణు నటన అందరినీ కట్టిపడేసింది. ఇప్పటివరకూ ఇలాంటి పాత్రలో నటించకపోయినా మంచు విష్ణు తన యాక్టింగ్‌తో మెప్పించాడు. శివుడికి తన కళ్లనే నైవేద్యంగా పెట్టే సీన్‌లో విష్ణు నటన చాలా బావుంది. అలానే మహదేవశాస్త్రి పాత్రలో మోహన్ బాబు సరిగ్గా సరిపోయారు. మోహన్ బాబుకి సరైన పాత్ర పడితే స్క్రీన్ మీద ఆయన చేసే మ్యాజిక్ ఏంటో మరోసారి కనిపించింది. చాలా రోజుల తర్వాత మోహన్ బాబు ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించారు. క్లైమాక్స్‌లో కన్నప్పని ఎలివేట్ చేసే సీన్‌లో తన నటనతో మెప్పించారు.ఇక మోహన్ లాల్ చేసిన కిరాటా పాత్ర ఇలా వచ్చి అలా వెళ్లిపోయినా కూడా ఆడియన్స్‌ని మెప్పిస్తుంది. నెమలి పాత్రలో తన అందాలతో ప్రీతి కనులవిందు చేసింది. తిన్నడి తండ్రి పాత్రలో శరత్ కుమార్ సరిగ్గా సరిపోయారు. ఇక శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతి దేవిగా కాజల్ ఉన్నంతలో న్యాయం చేశారు. సినిమాలో రుద్ర పాత్రకి పెద్దగా పెర్ఫామెన్స్ ఇచ్చే స్కోప్ లేదు కానీ ఆ క్యారెక్టర్‌లో ప్రభాస్ కనిపించిన తీరు ఫ్యాన్స్‌కి కిక్కిస్తుంది. ఇక బ్రహ్మానందం, శివబాలాజీ, సప్తగిరి సహా కొన్ని పాత్రలన్నీ ఉన్నాయంటే ఉన్నాయి అన్నట్లుగానే పరిమితమయ్యాయి.
సాంకేతికవర్గం పనితీరు :
ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే మంచు విష్ణు అందించాడు. తన కథలో ఎమోషన్, దైవత్వాన్ని మహాభారతం దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ బాగానే ప్రెజెంట్ చేశారు. విష్ణు కూడా స్క్రీన్ ప్లే బాగా డిజైన్ చేసాడు కానీ కొన్ని అనవసర సీన్స్ తగ్గించి డివోషనల్ ట్రాక్ లోనే నడిపి ఉంటే కన్నప్ప దీనికంటే ఇంకా సాలిడ్ ట్రీట్ ఇచ్చి ఉండేది. ముఖ్యంగా వి ఎఫ్ ఎక్స్ పనులకి ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి బెటర్ విజువల్స్ ని చూపాల్సింది. సినిమాకి బాగా ప్లస్ అయిన విషయం లొకేషన్స్. దీని గురించి మంచు విష్ణు పదేపదే చెబుతూనే ఉన్నారు. న్యూజిలాండ్‌లోనే ఈ సినిమా తీయడానికి గల కారణం చూసిన తర్వాత ఆడియన్స్‌కి అర్థమవుతుంది అన్నారు. నిజంగానే లొకేషన్స్ అందాలన్నీ చాలా బావున్నాయి. షెల్డన్ చావ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా నీటిగా ఉంది. స్టీఫెన్ డావెస్సి పాటలు చాలా బాగున్నాయి. బాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. . ప్రొడక్షన్ డిజైన్ కూడా సినిమాలో బాగుంది. ఆంటోనీ ఎడిటింగ్ బానే ఉంది అయితే ఫస్టాఫ్‌లో అక్కర్లేని కొన్ని లవ్ సీన్లు కట్ చేసి ఉంటే సినిమా నిడివి కూడా బాగా తగ్గి వుంది వుంటే సాలిడ్ ట్రీట్ ఇచ్చి ఉండేది. ఈ సినిమాలో నిర్మాణ విలువలు విలువల గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఫ్రేమ్ లో చిత్రానికి అయిన బడ్జెట్ కనిపిస్తుంది.
విశ్లేషణ :
సినిమా శివపార్వతుల సంభాషణతో మొదలవుతుంది. అక్కడ నుండి విష్ణు కవల కుమార్తెలు అరియానా, వివియానా పాడే పాటతో దారిలో పడుతుంది. బాల తిన్నడిగా విష్ణు కుమారుడు అవ్రామ్ నటించాడు. మూడు గంటల నిడివి ఉన్న ‘కన్నప్ప’ చిత్రంలో మొదటి రెండు గంటలు వీర కన్నప్ప గాధను చెప్పిన దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్… చివరి గంటను భక్త కన్నప్పగా మలిచారు. దాంతో ఒకే టిక్కెట్ మీద రెండు చిత్రాలు చూసిన భావన కలుగుతుంది. మొదటి రెండు గంటలు కన్నప్ప ప్రేమాయాణం, అతని వీరత్వంకు ప్రాధాన్యం ఇచ్చారు. కాలముఖుడి మరణం తర్వాత ప్రభాస్… రుద్రగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి సినిమా పోకడ పూర్తిగా మారిపోతుంది.
మరీ ముఖ్యంగా ప్రభాస్ కు మోహన్ బాబుకు, ప్రభాస్ కు తిన్నడికి, ప్రభాస్ కు నెమలికి మధ్య ఉండే సన్నివేశాలు సినిమాను నిలబెట్టాయి. అలానే తనువు చాలించే ముందు నాథనాధుడికి, అతని కొడుకు తిన్నడికి మధ్య సాగే సంభాషణలు ఆర్ద్రతతో కూడుకుని ఆకట్టుకుంటాయి. ప్రభాస్ వచ్చిన తర్వాత నుంచి సినిమా మరో లెవెల్ కి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి టేకోవర్ చేసిన విష్ణు ఒక సాలిడ్ ఎమోషనల్ ట్రీట్ తో చాలా రోజులు తర్వాత ఒక హిట్టింగ్ డివోషన్ డ్రామాని ప్రేక్షకులకు అందించాడు. ఫస్టాఫ్ ఇంకా కొన్ని సీన్స్ మినహాయిస్తే ఈ చిత్రం ఆడియెన్స్ ని మెప్పించి కదిలిస్తుంది. బయట ప్రచారం జరిగినట్టుగా ఎవరినీ కించపరిచే సన్నివేశాలు కానీ, ఎవరినీ తక్కువ చేసి చూపే సీన్స్ కానీ ఇందులో లేవు. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్ కు వచ్చి ‘కన్నప్ప’ను చూస్తే… ప్రేక్షకులకు సర్ ప్రైజింగ్ గా అనిపిస్తుంది. అయితే కమర్షియల్ గా ఏ మేరకు రన్ అవుతుందో వేచి చూడాలి.