మహేష్ చేస్తుంది కరెక్టేనా?
సూపర్ స్టార్ అంటే ఒకప్పుడు కృష్ణ అనుకుంటారు కానీ ఇప్పటి జెనరేషన్‌కు మాత్రం ఆయన వారసుడు మహేష్ బాబే. అందుకే సినిమాలో కంటెంట్ బాగుంటే ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్, యావరేజ్ ఉంటే మినిమమ్ సూపర్ హిట్‌తో గత మూడేళ్లుగా గ్రాఫ్ మామూలుగా లేదు. పోకిరి లాంటి పాత రీ రిలీజులతో సైతం హౌస్ ఫుల్ కలెక్షన్లు రాబట్టడం ఒక్క మహేష్ ఫ్యాన్స్‌కే సాధ్యమైంది. అందుకే ఇప్పుడు ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా తమ స్టార్ల క్లాసిక్స్‌ని థియేటర్లలో వేసుకోవడం మొదలుపెట్టారు.
అంతా బానే ఉంది కానీ ఇటీవలే మహేష్ బాబు ఒక ప్రైవేట్ ఛానల్‌తో ప్రమోషన్ పరంగా ఒక ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కూతురు సితారతో కలిసి డ్యాన్స్ రియాలిటీ షో కు గెస్టుగా వెళ్లొచ్చాడు. ఇప్పుడు అదే ఛానెల్లో ఒక టీవీ సీరియల్‌కు ప్రచారకర్తగా కనిపించడం కొందరు సగటు ప్రేక్షకులకు అంతగా నచ్చడం లేదు. మహేష్ లాంటి సూపర్‌స్టార్ ఇలా సీరియళ్లు చూడమని చెప్పడమేంటనేది వాళ్ల కంప్లైంట్.
ఇది రైటా రాంగా పక్కన పెడితే రెండింటికి ఒక్కో కోణం ఉంది. ప్రస్తుతం రెండేళ్లకు ఒక సినిమా మాత్రమే చేయగలుగుతున్న మహేష్ ఛారిటీ కోసం, చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం తగినంత మొత్తాన్ని సమకూర్చుకోవాలంటే ఇలాంటివి చేయాల్సిందే.













