రానా నటించిన ‘అరణ్య’ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయనున్న జీ తెలుగు
మానవాళికి అడవులు ఎంత ముఖ్యమో, ఆ అడవులకు ఏనుగులు అంతే ముఖ్యం. ఏనుగులకి అడవులకు ఉన్న సంబంధాన్ని చెప్పే సినిమా ‘అరణ్య’. ఇది ప్రకృతి విలువేంటో చెప్పే పదునైన కథాంశం. అలాంటి సినిమాను మన ప్రియమైన జీ తెలుగు జనవరి 9 సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా తీసుకువస్తుంది.
నరేంద్ర భూపతి అలియాస్ అరణ్య (రానా దగ్గుబాటి) ప్రకృతి ప్రేమికుడు. అడవులు, వన్యప్రాణులు అంటే ఆయనకు ప్రాణం. ఆయన తాతలు 500 ఎకరాల అడవిని ప్రభుత్వానికి రాసిస్తే… ఆయన ఆ అడవికి, అక్కడి వన్యప్రాణులకు సంరక్షకుడిగా ఉంటాడు. లక్షకు పైగా మొక్కలు నాటి రాష్ట్రపతి చేత ఫారెస్ట్ మాన్ ఆఫ్ ఇండియా అవార్డు అందుకుంటాడు. అడవిలోనే ఉంటూ అక్కడి ఏనుగులకు, గిరిజనులకు అండగా ఉంటాడు. ఇదిలా ఉంటే.. అటవీ శాఖ మంత్రి కనకమేడల రాజగోపాలం (అనంత్ మహదేవన్) ఆ అడవి స్థలంపై కన్నుపడుతుంది. అక్కడ డీఆర్ఎల్ టౌన్షిప్ని నిర్మించాలని భావిస్తాడు. దీని కోసం 60 ఎకరాల అడవిని నాశనం చేయాలనుకుంటాడు. దీనిని ప్రకృతి ప్రేమికుడు అరణ్య ఏ విధంగా అడ్డుకున్నాడు? తన కలల ప్రాజెక్టుకు ఆటంకం కలిగించిన అరణ్యను మంత్రి ఏవిధంగా హింసించాడు? చివరకు అడవిని, ఏనుగులను అరణ్య ఎలా కాపాడాడు? అనేదే మిగతా కథ
వైవిధ్యమైన పాత్రలు, కథా చిత్రాల్లో నటించే అతికొద్ది మంది నటుల్లో రానా ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచే వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పిస్తున్నాడు. పాత్ర ఏదైనా అందులో పరకాయప్రవేశం చేయడం రానా నైజం. ఈ సినిమాతో అది మరోసారి నిరూపితమైంది. చెట్లు, ఏనుగుల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిగా అరణ్య పాత్రలో రానా పరకాయ ప్రవేశం చేశాడు.
మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేస్తే వచ్చే వినాశనం గురించి చెప్పే ఒక పదునైన కథాంశం ‘అరణ్య’. ఈ ఆదివారం, జనవరి 9 సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగులో తప్పక చూడండి.













