దసరా విజేత ఎవరో?
ఈసారి దసరాకు కాస్త ముందుగానే బాక్సాఫీస్ దగ్గర సందడి మొదలుకానుంది. అంతేకాదు ఈ దసరాకు పోటీ కూడా ఆసక్తికరంగా మారింది. దీంతో బయ్యర్లు థియేటర్లు కళకళలాడటం ఖాయమనుకుంటున్నారు. అయితే ఈ దసరాకు మూడు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
అందులో మొదటిది భగవంత్ కేసరి. బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో యాక్షన్‌తో పాటూ ఎమోషన్‌కు కూడా పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. దానికి తోడు ట్రైలర్ కూడా బాగుడటంతో అంచనాలు బాగా పెరిగాయి. బాలయ్య-శ్రీలీల మధ్య ఎమోషనల్ సీన్స్ సినిమాకు హైలైట్ కానున్నాయని ముందు నుంచి చెప్తూ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు వచ్చే ఛాన్సుంది.
ఇక అదే రోజున రానున్న మరో సినిమా లియో. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన ఈ సినిమాను తెలుగులో సితార సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ట్రైలర్ పై కాస్త నెగిటివిటీ వచ్చినా, సినిమా క్లైమాక్స్ లో రామ్ చరణ్ క్యామియో ఉందని చెప్పి తెగ హైప్ తీసుకొచ్చారు. కాబట్టి లియో సినిమా డబ్బింగ్ మూవీ అయినప్పటికీ తక్కువ అంచనా వేయడానికి లేదు.
ఇక మూడో సినిమా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు. అక్టోబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా కూడా టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకుంది. కానీ పాటలు జనాల్లోకి అంతగా వెళ్లలేదు. ప్రమోషన్స్ విషయంలో నార్త్ పై ఎక్కువ ఫోకస్ పెట్టడంతో టాలీవుడ్ లో కాస్త హైప్ తగ్గింది. రిలీజ్ లోపు ఇక్కడ కూడా సినిమాను ప్రమోట్ చేసి హైప్ పెంచడం ఖాయం. ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా గెలుస్తుందో చూడాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే.













