పరశురామ్ నెక్ట్స్ ఎవరితో?
డైరెక్టర్ నుంచి ఒక మంచి హిట్ వచ్చాక ఆ తర్వాత చేయబోయే సినిమా మీద అందరికీ ఓ రేంజ్ లో అంచనాలుంటాయి. 2018లో గీత గోవిందం తర్వాత 5 ఏళ్లు కష్టపడితే కానీ పరశురామ్ తన తర్వాతి సినిమాను సెట్ చేసుకోలేకపోయాడు. మధ్యలో నాగచైతన్య హీరోగా సినిమా అనుకున్నారు కానీ అది ఓకే అనుకునే టైమ్ లో ఆపేయడంతో కోల్డ్ వార్ కు దారి తీసిన సంగతి తెలిసిందే.
సరిగ్గా అదే టైమ్ లో మహేష్ నుంచి సర్కారు వారి పాట ఆఫర్ రావడంతో పరశురామ్ లక్ బాగుందనుకున్నారు. ఆ సినిమాకు కలెక్షన్స్ అయితే వచ్చాయి కానీ కంటెంట్ పరంగా మాత్రం ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. ఇక రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.
గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో వచ్చిన సినిమా కావడంతో సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. కానీ ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ డిజాస్టర్ దిశగా అడుగులేస్తుంది. సెలవుల్ని సైతం ఫ్యామిలీ స్టార్ వాడుకోలేకపోతున్నాడు. దీంతో ఇప్పుడు పరశురామ్ తర్వాతి సినిమా కోసం ఏ హీరో ఒప్పుకుంటాడనేది పెద్ద ప్రశ్నగా మారింది. అసలే స్క్రిప్ట్ విషయంలో ఎవరి మాట వినడనే కామెంట్ ఈ డైరెక్టర్ గురించి చాలా బాగా వినిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే తన బ్యానర్లోనే పరశురామ్ కు దిల్ రాజు మరో ఆఫర్ ఇస్తానని హామీ ఇచ్చాడని అంతర్గతంగా వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.













