టార్గెట్ చేరడానికి ఫ్యామిలీ స్టార్ తిప్పలు
వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ ప్రేక్షకులకు నిజంగా పండగే. అదేనండి సినిమాల పండగ. ప్రతీ సంవత్సరంలా కాకుండా 2024 సంక్రాంతికి ఎన్నో భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పోటీతో సంబంధం లేకుండా ఎవరికి వారే సంక్రాంతి బరిలో సినిమాలను రిలీజ్ చేయాలని చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు.
ఈ రేసులో విజయ్ దేవరకొండ- పరశురామ్ పెట్ల కాంబినేషన్లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా కూడా ఉంది. ఫ్యామిలీ స్టార్ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మొదట్లో సంక్రాంతి తర్వాత రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ పండగ సీజన్‌ను క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో దిల్ రాజు ఈ సినిమాను సంక్రాంతి రేసులో నిలబెట్టారు.
దీంతో డైరెక్టర్ పరశురామ్ షూటింగ్ కు అసలు గ్యాప్ ఇవ్వకుండా సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. విజయ్ దేవరకొండ కూడా గౌతమ్ తిన్ననూరి సినిమాను హోల్డ్ లో పెట్టి మరీ ఈ మూవీకి ఎక్కువ డేట్స్ ఇచ్చాడు. అయితే ఈ మూవీ కోసం ఓ కీలక షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్ చేయగా, వీసా ప్రాబ్లమ్ కారణంగా ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయిందని తెలుస్తోంది.
దీంతో వీసా కోసం టైమ్ వేస్ట్ చేయడం ఇష్టం లేక స్టోరీలో కొన్ని చిన్న చిన్న ఛేంజెస్ చేసి బ్యాంకాక్ లేదా యూకేలో ఈ షెడ్యూల్‌ను షూట్ చేయాలని చూస్తున్నారట. ఎలాగైనా సినిమాను డిసెంబర్ లోపు పూర్తి చేసి సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని ట్రై చేస్తున్నారు. చాలా సినిమాలుగా హిట్ అందుకోని విజయ్‌కు ఫ్యామిలీ స్టార్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













