కమల్‌కు హీరోయిన్ ఫిక్స్
గతేడాది విక్రమ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు కమల్‌హాసన్. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌తో కలిసి చేసిన విక్రమ్ అందరి అంచనాలను మించి భారీ సక్సెస్ గా నిలిచింది. దీంతో కమల్ కెరీర్ మళ్లీ జోరందుకుంది. ప్రస్తుతం కమల్, మధ్యలోనే ఆగిపోయిన ఇండియన్-2 సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
ఇండియన్-2 అయిపోగానే వెంటనే మణిరత్నంతో కలిసి సెట్స్ మీదకు వెళ్లనున్నాడు కమల్. వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చి ముప్పై ఏళ్లు పైగా అయింది. మూడు దశాబ్దాల తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా రానుండటంతో అందరూ ఈ సినిమాపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా నాయకుడు అప్పట్లో ఓ ఊపు ఊపింది. మళ్లీ ఇంత కాలానికి ఈ కాంబో కార్యరూపం దాలుస్తుండటం ఫ్యాన్స్ కు ఆనందాన్నిస్తోంది.
ఈ చిత్రాన్ని కమల్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ మీద నిర్మిస్తున్నారు. ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ సినిమా ఆ తర్వాత అసలు వార్తల్లోనే లేదు. కానీ సైలెంట్ గా సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా మొదట త్రిష, నయనతార పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు మరో హీరోయిన్ పేరు ఈ సినిమా కోసం తెర మీదకు వచ్చింది.
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యాబాలన్ ను ఈ సినిమాలో కమల్ కు జోడీగా అనుకుంటున్నారట మణిరత్నం. విద్యా కమల్ కు జోడీగా దాదాపు ఫిక్స్ అయినట్లే అంటున్నారు. విద్యా, కమల్ జోడీనే ఇంట్రెస్టింగ్ అనుకుంటుంటే, ఈ సినిమా స్టోరీ గురించి మరో ఇంట్రెస్టింగ్ ప్రచారం నడుస్తుంది. చనిపోయిన ఓ మనిషి మళ్లీ బ్రతికి సమాజంలోకి వస్తే ఎదురయ్యే పరిస్థితులెలా ఉంటాయనే నేపథ్యంలో ఈ సినిమా నడవనుందని టాక్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో మణిరత్నం ప్రేక్షకులను ఎలా మెస్మరైజ్ చేస్తాడో చూడాలి. వచ్చే సమ్మర్‌కు ఈ సినిమా రిలీజ్ చేయాలని మణిరత్నం సన్నాహాలు చేస్తున్నారు.













