సూపర్‌స్టార్ కృష్ణ ఇకలేరు.. విషాదంలో సినీ పరిశ్రమ
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ (79) కన్ను మూశారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కృష్ణను కుటుంబ సభ్యులు గౌచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసముద్రంలో మునిగిపోయింది. 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. ఐదుగురు సంతానంలో ఈయన పెద్దవారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది. అయితే ఆయన తల్లిదండ్రులు మాత్రం కృష్ణను ఇంజనీర్ చేయాలనుకున్నారు. కానీ, సీటు దొరక్కపోవడంతో డిగ్రీలో చేరారు. అక్కడ చదువుతున్నప్పుడు ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా జన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు సినిమాలపై ఇష్టం మరింత పెరిగి ఈ రంగంవైపు వచ్చేశారు. 1965లో ఇందిరను కృష్ణ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం. రమేశ్‌బాబు, మహేశ్‌బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజులా. ఆ తర్వాత సినీ నటి, దర్శకురాలు విజయనిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. ఆమె కూడా ఈ మధ్యనే మృతి చెందారు.
1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు. ఆలా మొదలైన ఆయన సినీ ప్రస్థానం నాలుగు దశాబ్దాలుకు పైగా సాగింది. సినీ కెరీర్లో 340 పై చిలుకు సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తెరకెక్కించారు. 1983లో ప్రభుత్వ సహకారంతో సొంతంగా పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో నెలకొల్పారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తెరకెక్కించారు. సూపర్ స్టార్‌కు ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం (1997)లో, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2003), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (2008), పద్మభూషణ్ పురస్కారం (2009) వరించాయి. 1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభ భ్యునిగా గెలుపొందాడు.













