త్రివిక్రమ్ తో పని చేయనున్న సిద్దూ జొన్నలగడ్డ
డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు సిద్దు జొన్నలగడ్డ. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని దానికి సీక్వెల్ గా టిల్లు స్వ్కేర్ సినిమా చేశాడు సిద్దూ. ఆ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో సిద్దు క్రేజ్, మార్కెట్ బాగా పెరిగింది. దాంతో పాటూ నిర్మాతలు సిద్దూతో సినిమాలు చేసేందుకు వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం సిద్దూ జాక్ సినిమాతో పాటూ తెలుసు కదా చేస్తున్నాడు.
వాటితో పాటూ టిల్లూ క్యూబ్ ను కూడా అనౌన్స్ చేశాడు. ఈ మూడు సినిమాలు లైన్ లో ఉండగానే సిద్దూ మరో కొత్త సినిమాకు సైన్ చేశాడు. ఆ సినిమాకు మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ రచనా సహకారం అందించనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ అందించిన కథకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నాడట. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ సంస్థ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
సినిమాకు త్రివిక్రమ్ రచనా సహకారం అందిస్తుండటంతో సినిమాపై ముందు నుంచే అంచనాలు బాగా ఉంటాయి. ప్రస్తుతం దుల్కర్ తో లక్కీ భాస్కర్ చేస్తున్న వెంకీ అట్లూరి, అది పూర్తైన వెంటనే సిద్దూతో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ తో పని చేయడం వల్ల సిద్దు మార్కెట్ మరింత పెరగడం ఖాయం. ఈ ఏడాదే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.













