విశ్వంలో ట్రైన్ ట్రాక్‌తో వైట్ల మెప్పిస్తాడా?
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన డైరెక్టర్లలో శ్రీను వైట్ల ఒకరు. ఆయన ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా చేసినా సరే తనదైన రీతిలో కామెడీ ట్రాక్స్ తో ఆడియన్స్ ను నవ్విస్తూ ఉంటాడు. దూకుడు లో మహేష్ బాబు లాంటి హీరోతో కామెడీ చేయించి మంచి హిట్ అందుకున్నాడు. ఇక రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
సుమారు 45 నిమిషాల పాటూ సాగే ఈ ట్రైన్ ట్రాక్ ఆ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే తరహా వింటేజ్ ట్రైన్ ట్రాక్ ను శ్రీను వైట్ల, గోపీచంద్ తో తీస్తున్న విశ్వం సినిమాలో వాడాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు సంబంధించిన మేకింగ్ వీడియో రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ వీడియోలో ట్రైన్ ట్రాక్ ఉన్నట్లు చాలా క్లియర్ గా చూపించారు.అందులో నరేష్, ప్రగతి, చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్, శ్రీనివాస రెడ్డి, షకలక శంకర్ లాంటి మంచి ఆర్టిస్టులున్నారు. ఈ సీన్ కూడా వెంకీ లానే రన్నింగ్ ట్రైన్ లోనే నడుస్తుందని మేకింగ్ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. విజువల్స్ కూడా ఫన్నీగా అనిపించాయి. ఈ ట్రాక్ బాగా పేలి వర్కవుట్ అయితే మాత్రం విశ్వంకు రిపీట్ ఆడియన్స్ ఉండటం పక్కా. ఎంతో కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న శ్రీను వైట్లకు, గోపీచంద్ కు ఈ సినిమా విజయం ఎంతో కీలకం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.













