రౌడీబేబీ సూర్య ఓవర్ యాక్షన్.. కేసు నమోదు!
ఈమధ్యకాలంలో సోషల్ మీడియా యాక్టివిటీస్ బాగా పెరిగిన విషయం తెలిసిందే. అందులోనూ లాక్డౌన్ సమయంలో ఇది మరింత ఊపందుకుంది. టిక్‌టాక్, హలో వంటి యాప్స్‌లో రకరకాల వీడియోలు, డబ్‌స్మాష్‌లతో యూత్‌తోపాటు పెద్దవాళ్ళు కూడా తమ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటున్నారు. అలా టిక్‌టాక్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న సుబ్బలక్ష్మి ఓవరాక్షన్ చెయ్యడం వల్ల పోలీసు కేసులో ఇరుక్కుంది. తనపై పోలీస్ కేసు నమోదు కావడంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.
వివరాల్లోకి వెళితే.. టిక్‌టాక్‌లో రౌడీ బేబీ సూర్యగా ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది తమిళనాడుకు చెందిన సుబ్బలక్ష్మి. ఆమధ్య సింగపూర్ వెళ్లిన సుబ్బలక్ష్మి లాక్డౌన్ కారణంగా మూడు నెలలపాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. లాక్డౌన్ సడలించిన తర్వాత ఇండియా తిరిగొచ్చిన సుబ్బలక్ష్మికి ఎయిర్‌పోర్ట్‌లోనే కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సిబ్బంది నుంచి తప్పించుకొని ఇంటికి చేరుకుంది. అదేరోజు ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు, అధికారులు ఆమెను క్వారంటైన్‌కు తరలించేందుకు నానా తంటాలు పడ్డారు. టిక్‌టాక్ వీడియోల ద్వారా బాగా పాపులర్ కావడంతో ఎప్పుడూ తను ఓ స్టార్ హీరోయిన్ అనే బిల్డప్ ఇచ్చేది సుబ్బలక్ష్మి. అందుకే క్వారంటైన్‌కి తరలించిన తర్వాత హీరోయిన్లా ఎన్నో కండీషన్స్ పెట్టిందట. తాను సింగపూర్‌లో ఏసీ గదుల్లో ఉన్నానని, తనకు ప్రత్యేకంగా గది ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగిందట. అంతేకాదు గవర్నమెంట్ ఆస్పత్రిలో మామూలు జనంతోపాటు తాను ఉండనని నానా హడావిడి చేసిందట. దీని గురించి ప్రశ్నించిన ఓ విలేకరిని అసభ్యంగా తిట్టడంతో సుబ్బలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఓవర్ యాక్షన్‌తో అందర్నీ ఇబ్బంది పెట్టిన టిక్‌టాక్ స్టార్ సుబ్బలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అది తనకు జరిగిన పెద్ద అవమానంగా భావించిన ఆమె సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం సుబ్బలక్ష్మి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.













