రూ.110 కోట్ల డీల్ ప్రచారానికి ప్యారడైజ్ చెక్..
నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్(The Paradise) సినిమా చుట్టూ గత కొంతకాలంగా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. షూటింగ్ షెడ్యూల్ లేటవడం, రిలీజ్ డేట్ పై క్లారిటీ లేకపోవడం, బడ్జెట్ పెరిగిందనే డిస్కషన్స్ మధ్య తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు(Dil Raju) ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను రూ.110 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారనే ప్రచారం ఒక్కసారిగా సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వార్తకు ఎలాంటి అధికారిక ఆధారాలు లేకపోవడంతో ఇండస్ట్రీలోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈ ప్రచారం వేగంగా విస్తరించడంతో చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) వెంటనే స్పందించారు. ది ప్యారడైజ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని, సినిమా గురించి ఏ అధికారిక సమాచారం వచ్చినా తమ అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారానే వెల్లడిస్తామని స్పష్టం చేశారు. దీంతో రూ.110 కోట్ల డీల్‌పై జరుగుతున్న ప్రచారానికి నిర్మాతలే నేరుగా తెరదించారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో ఈ వార్త కేవలం రూమర్ మాత్రమేనని స్పష్టమైంది.
ప్రస్తుతం ది ప్యారడైజ్ షూటింగ్ కొనసాగుతుండగా, కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా భావిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) డైరెక్షన్, అనిరుధ్(Anirudh) మ్యూజిక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. అయితే రిలీజ్, బిజినెస్, డిస్ట్రిబ్యూషన్ వంటి అంశాలపై వస్తున్న అనధికారిక ప్రచారాల కంటే, మేకర్స్ నుంచి వచ్చే అధికారిక ప్రకటనలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్మాతల తాజా ప్రకటన మరోసారి స్పష్టం చేసింది.








