కన్నీళ్లు పెట్టిస్తున్న కమెడియన్ రామచంద్ర దీనస్థితి
▪️ ఒకప్పుడు కడుపుబ్బా నవ్వించిన హాస్య నటుడు
▪️ నేడు పక్షవాతంతో మంచానికే పరిమితం!
▪️ వైద్య ఖర్చులు భరించలేక ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు
▪️ సినీ పరిశ్రమకు, దాతలకు వేడుకోలు
ఆయన వెండితెరపై కనిపిస్తే చాలు.. ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వులు విరబూసేవి. తనదైన మార్క్ కామెడీ టైమింగ్, సహజసిద్ధమైన నటనతో వందకు పైగా చిత్రాల్లో అలరించిన ఆ నటుడి జీవితం ఇప్పుడు దీనస్థితిలో ఉంది. ఒకప్పుడు అందరినీ నవ్వించిన ఆ పెదవులు.. నేడు అనారోగ్యంతో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సహాయం కోసం ఆర్తిగా వేడుకుంటున్నాయి. టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ రామచంద్ర తీవ్ర అనారోగ్యంతో పక్షవాతం బారినపడ్డారు.
జూనియర్ ఎన్టీఆర్ తొలి చిత్రం ‘నిన్ను చూడాలని’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన రామచంద్ర, ఆ తర్వాత తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఆనందం’, ‘సొంతం’, ‘వెంకీ’, ‘కింగ్’, ‘దుబాయ్ శీను’, ‘లౌక్యం’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో హీరో స్నేహితుడిగా, విలక్షణమైన హాస్య నటుడిగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. రామచంద్ర అనే పేరు చెబితే వెంటనే గుర్తుపట్టకపోవచ్చు కానీ, ఆయా సినిమాల్లో ఆయన ముఖం, చేసిన కామెడీ సీన్లు చెబితే ప్రతి తెలుగు ప్రేక్షకుడికి ఇట్టే గుర్తుకొస్తాయి.
దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఈ నటుడి జీవితంలో ఊహించని తుఫాను వచ్చింది. ఇటీవల తీవ్ర పక్షవాతానికి గురికావడంతో బ్రెయిన్లో రక్తం గడ్డకట్టి ఆయన ఎడమ చేయి, కాలు పూర్తిగా పడిపోయాయి. దీంతో ప్రస్తుతం ఆయన నడవలేని, కదలలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారు.
ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో తన హృదయ విదారక పరిస్థితిని వివరిస్తూ రామచంద్ర తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అమ్మ నాన్నలు ఎప్పుడో కన్నుమూశారని, ప్రస్తుతం తమ్ముడే తనను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడని చెప్పారు. డాక్టర్లు రెండు నెలల పాటు పూర్తిగా బెడ్‌రెస్ట్ సూచించారని, ప్రతిరోజూ ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి వస్తోందని కన్నీటిపర్యంతమయ్యారు.
ఆర్థికంగా చితికిపోయి.. సాయం కోసం ఎదురుచూపులు
వైద్య ఖర్చులు భారం కావడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. “ఇటీవల ఆస్పత్రి చికిత్సకు రూ.80 వేలు ఖర్చయ్యాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) సభ్యుడిని కావడంతో కొంతవరకు సొమ్ము కవర్ అయింది. కానీ ప్రతిరోజూ అయ్యే వైద్య ఖర్చులు, థెరపీకి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాను. తోటి ఆర్టిస్టులకు నా పరిస్థితి చెప్పాను. పరిశ్రమలోని పెద్దలు, దాతలు స్పందించి ఎంతో కొంత ఆర్థిక సాయం అందిస్తే నా వైద్యానికి ఉపయోగపడుతుంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అందరినీ నవ్వించిన ఒక నటుడు నేడు ఇలాంటి ధీన స్థితిలో ఉండటం చూసి సినీ అభిమానులు, ప్రేక్షకులు తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురవుతున్నారు. ఒక కళాకారుడికి వచ్చిన ఈ కష్ట కాలంలో సినీ పరిశ్రమ పెద్దలు, దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.
సాయపడాలనుకునే దాతలు సహాయం అందించవచ్చు:
Ramachandra (GPay / PhonePe): 9849153361
Kalaga Narayana (GPay / PhonePe): 9848397834
Fundraiser Campaign Link: https://www.goodclap.com/fundraisers/help-artist-rama-chandra








