సీఎం చంద్రబాబు దీక్షకు సంపూర్ణ మద్దతు : తమ్మారెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్షకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రకటించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలపై పార్లమెంటులో అవిశ్వాసం పెడితే చర్చించకుండా సభను సజావుగా సాగనివ్వని ప్రధాని మోదీ, దీక్ష పేరిట ఎదురు దాడికి దిగడం ఆయన నిరంకుశ ధోరణికి అద్దం పడుతోందన్నారు. రాష్ట్రానికి అన్ని ఇచ్చామని బీజేపీ నాయకులు చెడుతుండటం విడ్డూరంగా ఉందని అన్నారు. వాళ్లు చెప్పిందల్లా విని తలాడించడానికి తెలుగు ప్రజలు అమాయకుల్లా కనిపిస్తున్నాఱా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. చెన్నై నుండి హైదరాబాద్‌కు రావడానికే 40 సంవత్సరాలు పట్టిందన్నారు. ఇప్పటికే చాలా సినిమా షూటింగ్‌లు రాష్ట్రంలో జరుగుతున్నాయని తెలిపారు. అమరావతి వేదికగా ఇక్కడి యువత షార్ట్ ఫిల్మ్, చిన్న సినిమాలు తీస్తూ సమాంతర పరిశ్రమను తీసుకొచ్చారన్నారు.
సినీ పరిశ్రమలో ఉన్నవారంతా చెడ్డవారు కాదని అన్నారు. సినీ పరిశ్రమ చెడ్డది అయితే తమ పిల్లలను ఎందుకు అందులోకి పంపుతామన్నారు. ముక్కు మొహం తెలియని వారు సినిమా అవకాశాల పేరిట ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోతే దానికి ‘మా’ ది బాధ్యతా? అని ప్రశ్నించారు. కాస్టింగ్ కౌచ్‌పై గతంలోనే తాను చెప్పినా, అప్పుడు ఎవరూ వినలేదని, ఇప్పుడు అసభ్యంగా తిట్టుకునేదాకా వచ్చిందన్నారు. కాస్టింగ్ కౌచ్ సమస్యలపై త్వరలోనే కమిటీ వేస్తున్నామని, ఎటువంటి తప్పులు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.













