Soori: రూ.20 తో కెరీర్ మొదలుపెట్టిన తమిళ నటుడు
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కోలీవుడ్ యాక్టర్ సూరి. 1998లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సూరి(Soori) దాదాపు ఆరేళ్ల పాటూ అసలు గుర్తింపు లేని పాత్రలే చేశాడు. 2004 నుంచి కమెడియన్ పాత్రలు చేస్తూ వచ్చిన సూరి 2022లో హీరోగా మారి వెట్రిమారన్ దర్శకత్వంలో విడుదల పార్ట్1 చేశాడు.
విడుదల పార్ట్1(Vidudhalai Part1) సినిమాతో హీరోగా అందరి ప్రశంసలు అందుకున్న సూరి ఆ తర్వాత గరుడన్(Garudan), కొట్టుక్కళి(Kottukkali), విడుదల2(Vidudhala2), బడవ(Badava) సినిమాలను చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా సూరి నుంచి మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే సూరి మామన్(Maaman) సినిమాతో థియేటర్లలోకి రానున్నాడు.
ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూరి మాట్లాడుతూ తన మొదటి జీతాన్ని, తాను నేర్చుకున్న జీవిత పాఠాలు గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. సినిమాల్లోకి రాకముందు తాను రోజుకి రూ.20 జీతానికి పని చేసేవాడినని, వారమంతా కష్టపడితే రూ.140 వచ్చేవని, అందులో సగం తాను వాడుకుని సగం డబ్బుని ఇంటికి పంపేవాడినని, ఆ టైమ్ లోనే తనకు జీవితం మంచి పాఠాన్ని నేర్పిందని చెప్పాడు. ప్రస్తుతం సూరి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతుండగా, రూ.20 తో కెరీర్ ను స్టార్ట్ చేసిన సూరి ఇప్పుడు కోట్లలో సంపాదించడం చూసి అందరూ అతన్ని అభినందిస్తున్నారు.






