చరిత్ర భవిష్యత్ ని వెంటాడితే?
ఆరు వందల ఏళ్ల క్రితం ఓ రాజు చేసిన తప్పు తర్వాత తరాల్ని ఎలా వెంటాడింది? ఓ విగ్రహం కారణంగా కొందరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అన్నది తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు సూర్య ఎం.ఎస్.ఎస్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం సువర్ణ సుందరి. చరిత్ర భవిష్యత్తును వెంటాడుతోంది ఉపశీర్షిక. జయప్రద, పూర్ణ సాక్షిచౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఎమ్.ఎల్.లక్ష్మి నిర్మిస్తున్నారు. ఈ నెల 31న విడుదలకానుంది. సెన్సార్ పూర్తయింది. యు.ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథాంశమిది. 1500 నుంచి 2000 సంవత్సరం మధ్య కాలంలో మూడు కాలాల వ్యవధుల్లో ఈ కథ సాగుతుంది అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. గ్రాఫిక్స్ అలరిస్తాయి. సెన్సార్ సభ్యులు మంచి సినిమా చేశామని ప్రశంసించడం ఆనందంగా ఉంది. ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి క్షణం ఉత్కంఠను పంచుతుంది అని పేర్కొన్నారు.













