రుణం తీర్చేసుకున్న సునీల్
కొంచెం ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు తమ సన్నిహితుల కోసం వాళ్ల సినిమాల్లో క్యామియోలు చేయడం, లేదంటే ప్రమోషన్ల టైమ్ లో హెల్ప్ చేయడం సినీ రంగంలో మామూలే. ఇలాంటివి ఎలాంటి ఛార్జీలు చేయకుండానే సాయం చేస్తుంటారు. కమెడియన్ సునీల్ హీరోగా మారి వరుసగా సినిమాలు చేసిన టైమ్ లో రవితేజ ఇలాగే చిన్న హెల్ప్ చేశాడు.
మర్యాద రామన్న సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ లా కనిపించిన సైకిల్‌కు వాయిస్ ఇచ్చాడు రవితేజ. రవితేజ డబ్బింగ్ ఆ సైకిల్ క్యారెక్టర్ కు సూపర్ గా సెట్టయింది. ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించింది. అప్పుడు రాజమౌళి అడిగితేనే రవితేజ ఆ హెల్ప్ చేసి ఉండొచ్చు కానీ సునీల్ కు మాత్రం అది బాగా ప్లస్ అయింది.
అప్పుడు రవితేజ చేసిన ఆ హెల్ప్‌కు సునీల్ ఇప్పుడు రుణం తీర్చుకున్నాడు. రవితేజ నిర్మాతగా ఇప్పుడు ఛాంగురే బంగారు రాజా అనే చిన్న సినిమా తెరకెక్కింది. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రాజు ఇందులో లీడ్ రోల్ చేశాడు. సత్య, రవిబాబు కీలక పాత్రలు పోషించారు. సతీష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అయింది.
ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆ ట్రైలర్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలా కనిపిస్తుంది. ట్రైలర్ బాగుంది. ఇందులో ఓ కుక్క క్యారెక్టర్ కీలకంగా కనిపిస్తుంది. ఈ సినిమాను నెరేట్ చేసింది కుక్క క్యారెక్టరే. దాని పేరు వీర బొబ్బిలి. ఆ కుక్క క్యారెక్టర్ కు సునీల్ గాత్ర దానం చేశాడు. ఒకప్పటి కామెడీ టచ్‌ను గుర్తుకు చేస్తూ చాలా ఫన్నీగా వాయిస్ ఓవర్ ఇచ్చాడు సునీల్. సినిమాలో కథను మలుపు తిప్పేది కూడా ఈ క్యారెక్టరేనట. మొత్తానికి రవితేజ నిర్మాణం వహిస్తున్న సినిమాలో కుక్క పాత్రకు వాయిస్ ఇచ్చి, సునీల్ తన రుణం తీర్చుకున్నాడన్నమాట.













