Sukumar: సొంతూళ్లో సుకుమార్

పుష్ప(Pushpa) సినిమాతో డైరెక్టర్ గా తన సత్తాను నెక్ట్స్ లెవెల్ లో చాటిన సుకుమార్(Sukumar) ఆ తర్వాత వచ్చిన పుష్ప2(Pushpa2) తో పాన్ ఇండియా స్థాయిలో తనేంటో ప్రూవ్ చేసుకుని పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. ఇంకా చెప్పాలంటే సుకుమార్ కెరీర్ పుష్ప ఫ్రాంచైజ్ సినిమాల తర్వాత దానికి ముందు అన్నట్టు మారింది. పుష్ప2 తో మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో సుకుమార్ తర్వాతి సినిమాను ఎలా తీస్తాడు? ఎవరితో తీస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
అయితే సుకుమార్ ఇప్పటికే తన తర్వాతి సినిమాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన(Buchi Babu Sana) దర్శకత్వంలో పెద్ది(Peddhi) సినిమా చేస్తున్న రామ్ చరణ్ దాని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తన 17వ సినిమాను చేయనున్నాడు. ఇదిలా ఉంటే సుకుమార్ తాజాగా తన సొంతూరు మట్టపర్రుకు వెళ్లాడు.
సుకుమార్ వచ్చాడని తెలిసి మీడియా అక్కడికి వెళ్లగా సుకుమార్ మీడియాతో మాట్లాడి పలు విషయాలను షేర్ చేసుకున్నాడు. ప్రతీ సంవత్సరం సంక్రాంతికి తాను సొంత ఊరికి వస్తానని, కానీ గత మూడేళ్లుగా పుష్ప సినిమా పనుల్లో తాను రాలేకపోయానని, నెక్ట్స్ సంక్రాంతికి తప్పకుండా ఊరికి వస్తానని చెప్పాడు. తన తర్వాతి సినిమా ఆర్సీ17(RC17)కు సంబంధించిన స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, పుష్ప2 సినిమా డైరెక్టర్ గా తనకు మరింత గుర్తింపుని తెచ్చిపెట్టిందని చెప్పాడు.