ఇంకా మారకపోతే ఎలా వైట్ల?
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా పేరొందిన శ్రీను వైట్ల పరిస్థితి గత కొన్నేళ్లుగా అస్సలు బాలేదు. అప్పట్లో రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ తర్వాత ప్లేస్ శ్రీను వైట్లదే ఉండేది. చిన్న, మధ్య తరహా సినిమాలతో మొదలుపెట్టి, భారీ స్థాయి సినిమాలు తీసే రేంజ్‌కు వెళ్లిన శ్రీను వైట్ల ఆ తర్వాత నుంచి పెద్ద స్థాయిలో భారీ బడ్జెట్‌తోనే సినిమాలు తీయడం అలవాటు చేసుకున్నాడు.
సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆయన మాత్రం భారీ సినిమాలే తీసుకొచ్చాడు. శ్రీను వైట్ల నుంచి సినిమా వస్తుందంటే పెద్ద మొత్తంలో బడ్జెట్ ఉండాల్సిందేనని రూల్ పెట్టుకున్నట్లు శ్రీను వైట్ల సినిమాలుండేవి. అందుకే ఆగడు, బ్రూస్ లీ లాంటి సినిమాలు ఘోరమైన ఫ్లాపులైనా వరుణ్ తేజ్ తో భారీ బడ్జెట్‌తో మిస్టర్, రవితేజతో అంతకుమించిన బడ్జెట్‌తో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు చేసి ఫెయిల్యూర్లు అందుకున్నాడు.
ఫలితంగా ఆయన్ను నమ్మి సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు భారీగా నష్టపోయారు. దీంతో శ్రీను వైట్లతో సినిమాలు తీయడానికి భయపడ్డ నిర్మాతలెవరూ ఆయనకు ఛాన్సులిచ్చే ధైర్యం చేయలేకపోయారు. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు మొన్నీమధ్య గోపీచంద్ తో సినిమాను అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందా అని చాలా మంది అనుమానపడ్డారు.
ఆ అనుమానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ను మొదలుపెట్టారు. యూరప్ లోని మిలాన్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినట్లు స్వయంగా శ్రీను వైట్ల ఓ వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇది చూసిన వారంతా ఇన్ని ఫ్లాపుల తర్వాత కూడా శ్రీను వైట్ల మారలేదని, పాత తరహాలోనే లొకేషన్లు, బడ్జెట్ మీద దృష్టి పెడుతున్నాడని, కంటెంట్ మీద దృష్టి పెట్టకుండా ఇలానే కంటిన్యూ చేస్తే ఈ నిర్మాతకు కూడా నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.













