SPBS: కళాత్మక ఆత్మ అభిమానుల ప్రేమ బాలు విగ్రహం నిత్య చిహ్నం – ఎం. వెంకయ్య నాయుడు
– రవీంద్రభారతిలో ఘనంగా ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ
తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల, బాలు ద్వయం స్వర్ణయుగం తెచ్చారని, తెలుగు పాటను సుసంపన్నం చేసి తెలుగు వారి హృదయంలో సింహాసనం వేసి పాటకు పట్టాభిషేకం చేశారని భారత పూర్వ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. కళాత్మక ఆత్మకు అభిమానుల ప్రేమకు బాలు విగ్రహం నిత్య చిహ్నం అని ఆయన అభివర్ణించారు. సోమవారం తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతి ప్రాంగణంలో గాన గంధర్వుడు పద్మవిభూషణ్ దివంగత డాక్టర్ ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కనుల పండువగా జరిగింది. ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఎం. వెంకయ్య నాయుడు, పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని ఎస్పి బాలు కాంశ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
భాషను గౌరవించుకోవాలి, తెలుగు వారిని గౌరవించుకోవాలి, టిజి అని, ఏపీ అని, ఎస్పీ అని కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బాల సుబ్రహ్మణ్యం అని పూర్తిగా పిలవడం అలవాటు చేసుకోవాలని ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. పరిపూర్ణ వ్యక్తిత్వం కలగలసిన ప్రతిభామూర్తి, సంస్కారవంతుడు, స్నేహశీలి, నిత్య కృషీవలుడు బాలసుబ్రహ్మణ్యం అని, రవీంద్రభారతిలో ఆయన స్థాపించిన ఘంటసాల విగ్రహం పక్కనే వారి విగ్రహం పెట్టడం సముచితంగా ఉందన్నారు. బాలసుబ్రహ్మణ్యం పాట ప్రేమ ఎవ్వరిని వదలదని, ఆయన సంస్కారం ఆదర్శం, స్వర సౌర్వభౌమత్వానికి నిలువుటెత్తు నిదర్శనం, నవ తరానికి యువ తరానికి రేపటి తరానికి గుర్తు చేయడం కోసమే ఆయన విగ్రహం ఏర్పాటు అని వెంకయ్య నాయుడు తెలిపారు. తెలుగు పాటను తెలుగు భాషను సంస్కృతి సంప్రదాయాలను ఎంతో గౌరవించి యువతకు స్ఫూర్తినిచ్చి పాడుతా తీయగా ద్వారా ఎందరో యువ గాయకులను తీర్చిదిద్దిన బాల సుబ్రహ్మణ్యం వ్యక్తిత్వం మహోన్నతం అని, బాలు సుస్వరాల అక్షయ పాత్ర అని కొనియాడారు. సినీ సంగీత శిఖరాగ్రంలో వున్నా మట్టి పరిమళాన్ని మరచిపోలేని బాలు వ్యక్తిత్వం తనకెంతో ఇష్టం అన్నారు. వేకువ జామున ఘంటసాల, బాలు పాటలతోనే తన దైనందిన చర్య ప్రారంభం అవుతుందన్నారు. తనది నెల్లూరు అయినా హైదరాబాద్ లో నివసిస్తున్నా కాబట్టి తాను తెలంగాణ వాడినేనని వెంకయ్య నాయుడు చెప్పుకున్నారు.
పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తెలుగు సినిమా పాటల గౌరవం బాలు అని అభివర్ణించారు. బాలు పాటలాగే ఆయన మనసు కూడా ప్రేమమయం అని కితాబునిచ్చారు. బాలు అజాత శత్రువు అని, ప్రేమ ఆత్మీయతలతో కూడిన బాలు హృదయం తరతరాలకు స్ఫూర్తిదాయకం, బాలు పాటలు అజరామరం అని కొనియాడారు.
కళలకు ఎల్లలు లేవు – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
కళాకారులకు ముఖ్యంగా సంగీతానికి భాష ప్రాంత బేధాలు లేనేలేవని, వ్యక్తిత్వ వికాసానికి సంగీతం ఎంతో దోహదం చేస్తుందని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సినీ సంగీత ప్రపంచంలో రారాజు, పాటల సామ్రాజ్యంలో నెలరాజు బాలుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గౌరవం రవీంద్రభారతిలో విగ్రహం అన్నారు. కుల మత ప్రాంతం చూడకుండా తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పి వందల మంది గాయకులను తీర్చిదిద్దిన బాలు విగ్రహాన్ని కళల కేంద్రం రవీంద్రభారతిలో, ఆయన నెలకొల్పిన ఘంటసాల విగ్రహం పక్కనే ఏర్పాటు చేయాలనే సంకల్పం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని, తెలుగు పాటకు ఇచ్చిన గౌరవం అన్నారు. సినీ సంగీత చరిత్రలో చెదరని సంతకం బాలు అన్నారు. హైదరాబాద్ లోనే 38 వేలకు పైగా పాటలు పాడిన రికార్డు బాలు సొంతం అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
బాలు కుమారుడు ఎస్పీ చరణ్ మాట్లాడుతూ రవీంద్రభారతిలో బాలు విగ్రహం ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజలకు కన్నీటి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు, మల్లు ప్రసాద్, శాంతా బయోటెక్స్ చైర్మన్ పద్మభూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి, రామోజీ గ్రూప్ సిఇవో సి.హెచ్. కిరణ్, ఈటీవీ సిఇవో విజయ బాపినీడు, బాలు భార్య ఎస్పీ సావిత్రి, కుమార్తె ఎస్పీ పల్లవి, చెల్లెలు ఎస్పీ శైలజ, శుభలేఖ సుధాకర్, ఎస్పీ పార్వతి, ఎస్పీ వసంత తదితరులు పాల్గొన్నారు.
బాలు ప్రాణ స్నేహితుడు జివి మురళి, విగ్రహ శిల్పి ఉడయార్ రాజకుమార్ లను సత్కరించారు. నటుడు ప్రదీప్, సుమ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మ్యూజిక్ గ్రూప్ సంస్థ అధ్యక్షులు అచ్యుత రామరాజు, కార్యదర్శి బి. ఎస్. కృష్ణమూర్తి, వేదుల సుదర్శన్, ధర్మతేజ, సురేఖా మూర్తి, రామాచారి సమన్వయం చేశారు. సభానంతరం మ్యూజిక్ గ్రూప్ ఆధ్వర్యంలో బాలుకు పాటల నివాళిగా సుస్వరాభిషేకం వీనుల విందుగా జరిగింది. వంద మందికి పైగా సినీ నేపథ్య గాయకులు పాల్గొని బాలు పాటలు ఆలపించారు. సినీ సంగీత దర్శకులు కీరవాణి, తమన్, మణిశర్మ మాధవపెద్ది సురేష్, కోటి, వందేమాతరం శ్రీనివాస్, మిక్కి జె. మేయర్, ఆర్. పి. పట్నాయక్ తదితరులు పాల్గొని పాటలతో బాలుకు ఘన నివాళులు సమర్పించారు. కీరవాణి, ఎస్పీ చరణ్, ఎస్పీ శైలజ, సునీత, కల్పన, మాళవిక, శ్రీకృష్ణ, ధనుంజయ్, గాయత్రి, లాస్య, జయరాం, వినోద్ బాబు తదితరులు బాలు పాటలు ఆలపించారు.






