మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శివన్న
ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి బాగా పెరిగింది. అందుకే ప్రతీ హీరో తమ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. తమ మార్కెట్ ను విస్తరించుకోవాలని అన్ని భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వేరే భాషలో తమ సినిమాకు మార్కెట్ బాగా జరగాలనే నేపథ్యంలో ఆయా భాషలకు చెందిన స్టార్ యాక్టర్లను అందులో కీలక పాత్రల్లో నటింపచేసి సినిమాకు బజ్ పెంచుతున్నారు.
వేరే భాషల నటులు కూడా సౌత్ సినిమాల్లో నటించడానికి ఆసక్తిగానే ఉన్నారు. సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్, సంజయ్ దత్ ఇప్పటికే సౌత్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడానికి ఒప్పుకున్నారు. మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి మలయాళ నటులకు కూడా వేరే భాషల్లో ఆదరణ ఉంది. మంచి పాత్రలొస్తే చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇప్పుడు తెలుగులో బిజీ కానున్నట్లు తెలుస్తోంది. ఆయన వేరే భాషల్లో నటించింది చాలా తక్కువ. శివరాజ్ కుమార్ తెలుగులో మొదటిసారి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో కనిపించాడు. తర్వాత జైలర్ మూవీతో కోలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు తెలుగులో రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమాలో ఓ కీలక పాత్ర చేయనున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు.
ఇది కాకుండా తెలుగులో మరో సినిమాకు శివన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు దర్శకత్వంలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో శివరాజ్ కుమార్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. సినిమా ప్రారంభోత్సవంలో శివరాజ్ కుమార్ కూడా పాల్గొనే ఛాన్సుందని అంటున్నారు. ఈ రెండు సినిమాలు హిట్టయితే శివన్న టాలీవుడ్ లో బిజీ యాక్టర్ గా మారడం ఖాయం.













