సిరివెన్నెలను సన్మానించిన తెలుగు సినీ రచయితల సంఘం
ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు సినీ రచయితల సంఘం హైదరాబాద్‌లో ఆయన్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సిరివెన్నెల మాట్లాడారు. కళలో సాహిత్యం అనేది అనేక రూపాలుగా ఉంటుందన్నారు. అందులో విశిష్టమైంది నాటకం అన్నారు. ఆ నాటకానికి సాంకేతిక రూపమే సినిమా అన్నారు. సమాజాన్ని నిలువెత్తు అద్దంలా సినిమా తెర చూపిస్తుందన్నారు. సినిమా అంత గొప్పది కాబట్టే తాను సినిమా రంగాన్ని దేవాలయంగా భావిస్తానని అన్నారు. నా మాట పద్యమై పుట్టాలనే తపనతోనే ప్రతి పాటను రాస్తుంటానని, అమ్మవారుందరికీ పాదపీఠం పద్మమే కాబట్టి వాళ్లందరి ఆశీస్సులతోనే ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా రాస్తున్నానని అన్నారు. తనకు సంతృప్తి లభించేవరకు రాస్తూనే ఉంటానన్నారు. తన దృష్టిలో భారతీయుడు అంటేనే భారతరత్న అని.. భవిష్యత్‌లో మరిన్ని మంచి పాటలు రాస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో రచయితలు విజయేంద్రప్రసాద్, పరుచూరి వెంకటేశ్వరరావు, జొన్నవిత్తుల, వెన్నెలకంటి, రామజోగయ్య శాస్త్రి, ఆర్పి పట్నాయక్, వడ్డేపల్లి కృష్ణ, భాస్కరభట్ల, బుర్రా సాయిమాధవ్, వైవిఎస్ చౌదరి, గుణ్ణం గంగరాజు, కె.ఎల్.నారాయణ, బలభద్రపాత్రుని రమణి, రామ్‌ప్రసాద్, రామకృష్ణ ఆకెళ్ల, వేమూరి, వెనిగళ్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.













