Saptagiri: సప్తగిరి పక్కన నటించడానికి ఎంతోమంది నో చెప్పారట!
టాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్లున్నా హీరోల పక్కన హీరోయిన్లకు ఎంపిక చేయడానికి నానా తంటాలు పడుతున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలో తన పక్కన నటించడానికి చాలా మంది హీరోయిన్లు నో చెప్పారని చెప్తున్నాడు సప్తగిరి(Saptagiri). కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించాడు సప్తగిరి.
మగజాతి ఆణిముత్యంగా తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్(Pelli Kani Prasad) సినిమా మార్చి 21న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీలో పేరున్న హీరోయిన్ ను తీసుకోవాలని మేకర్స్ ఎంతగానో ప్రయత్నించారట.కానీ తన పక్కన నటించడానికి చాలా మంది ఒప్పుకోలేదని, కమెడియన్ పక్కన హీరోయిన్ గా చేయడమేంటన్నారని వెల్లడించాడు.
ఆఖరికి ప్రియాంక శర్మ(Priyanka Sharma) సినిమాలో నటించేందుకు ఒప్పుకుందని చెప్పిన సప్తగిరి రియల్ లైఫ్ లో తనకింకా ఎందుకు పెళ్లి కాలేదో కూడా చెప్పాడు. ఈ రోజుకి కూడా సినిమా వాళ్ళకు పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని, అయితే తనకు పెళ్లి కాలేదని ఎవరూ జాలి పడే పన్లేదని, ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని సప్తగిరి చెప్పాడు.













