సల్మాన్ భద్రతా ఆందోళనలు.. కెరీర్‌కు సవాల్!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(salman khan) ప్రస్తుతం కెరీర్ పరంగా కీలక దశను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు వరుస సక్సెస్‌లతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన ఈ స్టార్‌కు ఇటీవలి సినిమాలు ఆశించిన స్థాయిలో కలెక్షన్లను అందించలేకపోయాయి. బజరంగీ భాయిజాన్(Bhajarangi bhaijan), సుల్తాన్(Sulthan), టైగర్ జిందా హై(Tiger zinda hai) వంటి సినిమాలతో భారీ సక్సెస్‌లను సొంతం చేసుకున్న సల్మాన్‌కు కిసీ కా భాయ్ కిసీ కీ జాన్(Kisi ka bhai kisi ki jaan), సికందర్(Sikandar) సినిమాలు నిరాశనే మిగిల్చాయి. దీంతో ఆయన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.
మరోవైపు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వస్తున్న బెదిరింపులు సల్మాన్‌కు కొత్త సమస్యగా మారాయి. 1998 నాటి కృష్ణజింకల వేట కేసు నేపథ్యంలో ఆయనకు పలుమార్లు హెచ్చరికలు రావడం, 2024 ఏప్రిల్‌లో గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద కాల్పుల ఘటన జరగడం భద్రతపై ఆందోళనలను పెంచాయి. తాజాగా ముంబైలో టైగర్ ష్రాఫ్(Tiger Shroff)కు సంబంధించిన కాల్పుల ఘటన నేపథ్యంలో సల్మాన్ టార్గెట్ గా ఉన్నారనే ప్రచారం కూడా చర్చనీయాంశమైంది.
ఈ పరిణామాలు సల్మాన్‌తో సినిమాలు చేయాలనుకునే నిర్మాతలను పునరాలోచనలో పడేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. షూటింగ్‌లకు ఎక్స్ట్రా సేఫ్టీ కల్పించడం, అవుట్డోర్ షెడ్యూళ్ల నిర్వహణ, పెరిగే ఖర్చులు నిర్మాతలకు భారంగా మారే అవకాశముంది. అయితే ఆయనతో వర్క్ చేయడానికి నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారనే వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది. బాక్సాఫీస్ సక్సెస్‌ను తిరిగి అందుకోవడంతో పాటు భద్రతాపరమైన సవాళ్లను అధిగమించడం సల్మాన్‌కు ఇప్పుడు కీలకంగా మారింది.








