మరింత ఆలస్యం కానున్న సలార్2
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో గతేడాది డిసెంబర్ లో వచ్చిన సలార్ సినిమా రూ.700 కోట్ల కలెక్షన్స్ ను అందుకుని ప్రభాస్ ఖాతాలో మంచి హిట్ గా నిలిచింది. దానికి ముందు ప్రభాస్ చేసిన సినిమాలు డిజాస్టర్లవడంతో ఆయన ఇమేజ్ కు కొంతవరకు నష్టం కలిగింది. కానీ సలార్ సినిమాతో ప్రభాస్ తన స్టామినాను నిరూపించుకున్నాడు.
దేవా పాత్రలో ప్రభాస్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ ను ఈ సినిమాలో చాలా గొప్పగా ఎలివేట్ చేశాడు. దీంతో సలార్ సీక్వెల్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఖాన్సార్ కథ మొత్తం సలార్2 లోనే ఉండబోతుందని తెలిశాక ఈ సీక్వెల్ కోసం అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే సలార్2 షూటింగ్ ఈ ఏడాది మొదలుపెట్టి 2025లో రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.
ఎందుకో తెలీదు కానీ సలార్2 మాత్రం లేటవుతూనే వస్తోంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ అనూహ్యంగా ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే ఎన్టీఆర్ సినిమా లాంచ్ కానుందట. ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యాకే నీల్, సలార్2ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వేరే సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ సినిమాల కోసం కొత్త లుక్ ను ట్రై చేస్తున్నాడు. సలార్2 కోసం ప్రభాస్ మాస్ లుక్ లో కనిపించాల్సి ఉంటడం వల్ల లుక్ డిఫరెన్స్ వస్తుందనే కారణంతోనే ఈ సినిమా లేటవుతుందని చెప్తున్నారు. ఏదేమైనా సలార్2 కోసం వెయిటింగ్ పెరుగుతుందనేది మాత్రం వాస్తవం.













