ఆ వార్త నిజం కాదు
అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో కోన వెంకట్, టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో అనుష్క వినికిడి శక్తిలేని అమ్మాయిగా కనిపిస్తుంది. పెయింటర్‌గా ఈ సినిమాలో అనుష్క ఓ కొత్త పాత్రను చేసింది. ఈ సినిమా నిర్మాణం ఎప్పుడో పూర్తయినప్పటికీ లాక్డౌన్ కారణంగా విడుదలకు నోచుకోలేదు. ఇప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ తెరుచుకునే అవకాశం లేకపోవడంతో నిశ్శబ్దం చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేయబోతున్నారన్న వార్త బయటికి వచ్చింది. ఒక ఓటీటీ సంస్థ ఈ చిత్రాన్ని 26 కోట్లకు ఖరీదు చేసిందని, త్వరలోనే ఓటీటీలో విడుదల కాబోతోందని ప్రచారం జరిగింది. వాస్తవానికి ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసే ఉద్దేశం దర్శకనిర్మాతలకు లేదని తెలుస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ ఎంతో కష్టపడి తీసిన తమ సినిమాను ఎంత ఆలస్యమైనా థియేటర్స్‌లోనే విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు.













