కొత్త జానర్లలో సినిమాలు చేస్తానంటున్న రవితేజ
సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే రవితేజ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తను నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా రిలీజ్ కు రెడీగా ఉన్న నేపథ్యంలో ఆ సినిమాను నార్త్ లో తెగ ప్రమోట్ చేస్తున్నాడు రవితేజ. ఇందులో భాగంగానే పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలిస్తున్నాడు.
ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రవితేజ మాట్లాడుతూ, ఇకపై తాను అన్నీ డిఫరెంట్ జానర్స్ లోనే సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. అంతేకాదు సైన్స్ ఫిక్షన్ మూవీ కూడా చేయబోతున్నట్లు రవితేజ స్పష్టం చేశాడు. కాకపోతే డైరెక్టర్ ఎవరనేది మాత్రం ఆయన చెప్పలేదు. మాస్, యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అయిన రవితేజ చాలా కాలంగా రొటీన్ కమర్షియల్ సినిమాలే చేస్తున్నాడు.
మధ్యలో రాజా ది గ్రేట్ లాంటి కొత్త ప్రయత్నాలు చేశాడు కానీ అది కూడా కమర్షియల్ సినిమానే. ఇకపై అలా కాకుండా, ప్రతి సినిమా ఓ కొత్త జానర్ ను టచ్ చేసేలా చూసుకుంటానన్నాడు. టైగర్ నాగేశ్వరరావు తర్వాత ఈగల్ అనే స్పై థ్రిల్లర్ లో ఇప్పటికే ఓ సినిమా సెట్స్ పైన ఉంది. ఇది కాకుండా గోపీచంద్ మలినేనితో యదార్థ సంఘటనల ఆధారంగా ఓ సినిమా, సైన్స్ ఫిక్షన్ మూవీ మరియు ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ ఫిల్మ్ కూడా చేయనున్నట్లు రవితేజ తెలిపాడు.













