మహేష్ దారిలో మాస్ మహారాజా
ఒకప్పుడు హీరోలంటే కేవలం నటించేవారు మాత్రమే కానీ ఇప్పుడు యాక్టింగ్ తో పాటూ రకరకాల బిజినెస్ లు కూడా చేస్తున్నారు. ఇంతకుముందు సినిమాల్లో నటించినందుకు వచ్చిన డబ్బుల్ని రియల్ ఎస్టేట్ లో పెట్టి ఇన్వెస్ట్ చేసేవాళ్లు. లేదంటే థియేటర్లు కట్టి వారి ద్వారా వచ్చిన డబ్బును వారసులకు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రతీదీ ఖర్చైపోవడంతో సొంతంగా ఏదీ చేయలేకపోతున్నారు.
అందుకే ఇప్పుడు ప్రతీ బిజినెస్ లో పార్ట్నర్షిప్స్ ఎక్కువైపోయాయి. సినిమా రంగంలో మల్టీప్లెక్స్ వ్యాపారం బాగా ఎక్కువవుతున్న నేపథ్యంలో టాలీవుడ్ హీరోలంతా ఈ బిజినెస్ లో అడుగుపెడుతున్నారు. గచ్చిబౌలిలో ఏషియన్ సినిమాస్ తో కలిసి మహేష్ బాబు మల్టీప్లెక్స్ కట్టాడు. దానికి మంచి రెస్పాన్స్ రావడంతో మహబూబ్ నగర్ లో విజయ్ దేవరకొండ కూడా వీరితోనే కలిసి ఓ మల్టీప్లెక్స్ ను నిర్మించాడు.
ఇక అమీర్పేట్ లో సత్యం థియేటర్ ను పడగొట్టి అందులో మల్టీప్లెక్స్ కట్టి బన్నీ కూడా ఈ బిజినెస్ లోకి ఎంటరయ్యాడు. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కూడా ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. దిల్ సుఖ్ నగర్ లో ఆరు స్క్రీన్ల మల్టీప్లెక్స్ ను రవితేజ, ఏషియన్ సినిమాస్ తో కలిసి కడుతున్నట్లు సమాచారం. త్వరలోనే వీటికి సంబంధించిన పనులు కూడా మొదలుకానున్నాయట. ఓ వైపు థియేటర్లు ఎక్కువైపోతున్నాయని బయ్యర్లు వాపోతున్న టైమ్ లో హైదరాబాద్ లో ఇలా ఎక్కువ సంఖ్యలో మల్టీప్లెక్సులు రావడం గమనార్హం.













