వెండి తెర పైకి టాటా జీవిత కథ
టాలీవుడ్ లో బయోపిక్స్ హవా చల్లారిన తర్వాత మరొక బయోపిక్ అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. బయోపిక్ పరంపరలో ముందుగా మహానటి సావిత్రి జీవిత కథ ప్రేక్షకులని అలరించింది. వెనువెంటనే ప్రముఖ రంగాలలో ఉన్న వైఎస్సార్, ఎన్టీఆర్ జీవిత కథలను బయోపిక్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
తర్వాత తర్వాత ఈ బయోపిక్ ల హవా కాస్త నెమ్మదించింది. స్టార్ హీరోలందరూ పెద్ద నిర్మాతలతో పాన్ ఇండియా సినిమాల దారి పట్టడంతో బయోపిక్స్ ని మర్చిపోయారు. తాజాగా మరో కొత్త జీవిత చరిత్రని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన రతన్ టాటా జీవిత చరిత్రను బయోపిక్ గా వెండితెర మీదకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. సుధా కొంగర ఆ బాధ్యతలు తీసుకున్నట్లు, ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసి వచ్చే సంవత్సరం అక్టోబర్ కల్లా సినిమాని లాంచ్ చేయాలని చూస్తున్నారు. ఈ బయోపిక్ లో రతన్ టాటా పాత్రని ఎవరు పోషిస్తారు? అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. తెరమీదకి ముగ్గురు స్టార్ హీరోల పేర్లు వచ్చాయి. అందులో హీరో మహేష్ బాబు ఒకరు. ఈ సినిమా కోసం మహేష్ ని అప్రోచ్ అయినట్టు సమాచారం. అలాగే తమిళ హీరో సూర్య, హిందీ నటుడు అభిషేక్ బచ్చన్ బరిలో ఉన్నట్టు సమాచారం.
ఈ చిత్రాన్ని మొత్తం తెలుగు, తమిళ్, హిందీ భాషలలో తీసి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించే బాధ్యతలు బడా నిర్మాణ సంస్థ అయిన హంబెలె ఫిలిమ్స్ తీసుకున్నట్లు సమాచారం. ఇంతకు ముందే ఈ నిర్మాణ సంస్థ బయోపిక్ తీస్తున్నట్లు తెలిపింది. ఈ బయోపిక్ లో సూర్య నటించనున్నట్లు దర్శకుడు సుధా కొంగర వెల్లడించారు. కానీ ఇప్పుడు హీరో విషయంలో సమీకరణాలు మారుతున్నట్లు తెలుస్తుంది.
ఇక మహేష్ విషయానికి వస్తే ,ఈ బయోపిక్ లో నటించడానికి ఛాన్సెస్ తక్కువగానే కనిపిస్తున్నాయి. అతను ఎక్కువ సాఫ్ట్ పిక్చర్స్ లో నటించడానికే ఆసక్తి చూపిస్తారు. మరి ఇప్పుడు మహేష్ ఈ బయోపిక్ లో నటిస్తారో లేదో చూడాలి.













