ఆ డైరెక్టర్ తో రాపో మూవీ?
గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. రీసెంట్ గా రామ్, బోయపాటి తో కలిసి చేసిన స్కంద సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా బోల్తా కొట్టిందో తెలిసిందే. రామ్ నుంచి ఇలాంటి సినిమా అసలెవరూ ఊహించలేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహపడ్డారు.
ఎలాగైనా ఇప్పుడు పూరీతో చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ తో బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తున్నాడు రామ్. కానీ పూరీ కూడా లైమ్ లైట్ లో లేడు. లైగర్ తో దారుణమైన డిజాస్టర్ ను అందుకున్న పూరీ కూడా డబుల్ ఇస్మార్ట్ పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి కెరీర్ ను సరైన గాడిలో పెట్టాలని చూస్తున్న రామ్, తన తర్వాతి సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్ తర్వాత రామ్, మాలీవుడ్ డైరెక్టర్ ను లైన్ లోకి దింపడానికి ప్లాన్ చేస్తున్నాడట. దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ తో కలిసి ఓ సినిమా చేయడానికి ఇప్పటికే డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో వీరిద్దరి మధ్య చాలా కాలంగా డిస్కషన్స్ జరుగుతున్నాయని, అవన్నీ ఓ కొలిక్కి రావడంతో సినిమా చేయడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన స్టోరీ కూడా ఇప్పటికే లాక్ అయిందని, కొన్ని మార్పులు చేసి ఫైనల్ వెర్షన్ ను రెడీ చేయడమే ఆలస్యమని సమాచారం. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా మొదలుపెట్టి, వచ్చే ఏడాది జూన్ కల్లా ఫస్ట్ పార్ట్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట రామ్, జీతూ. త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తోంది.













