ఆ దెబ్బతో మళ్ళీ నటనపై మొగ్గు చూపిన అవార్డు విన్నింగ్ దర్శకుడు
అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్, ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసాడు. అయితే చిలసౌ సినిమాతో దర్శకుడిగా మారి అప్పట్నుంచి నటనకు బ్రేక్ ఇచ్చాడు. సుశాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమాకి విమర్శకుల నుండి ప్రశంసలు రావడంతో పాటు స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు రాహుల్. ఐతే ఆ తర్వాత నాగార్జునతో మన్మధుడు 2 సినిమా తీసాడు. ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది. నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
గత కొంత కాలంగా నటనకు దూరంగా ఉన్న రాహుల్, తాజాగా నటి ఐశ్వర్య రాజేష్‌తో కలిసి మలయాళంలో విజయవంతమైన ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్.. నిమిషా సజయన్ అనే పాత్రలో నటిస్తుండగా ఆమె భర్తగా రాహుల్ కనిపించనున్నాడట. రాహుల్ రవీంద్రన్ ట్వీటర్ వేదికగా స్పందిస్తూ..‘‘ఈ సినిమాలో నటించడానికి ఎంతో ఆస్తకిగా ఎదురుచూస్తున్నా’’ అంటూ చెప్పుకొచ్చారు. ఆర్ కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మసాలా పిక్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా సెట్స్ పైకి వెళ్లగా, ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నారట. ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ తెలుగులో నాని కథానాయకుడిగా నటిస్తోన్న ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.













