విజయ్ దేవరకొండకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మద్దతు
వెబ్‌సైట్స్‌లో వస్తున్న ఫేక్ న్యూస్ గురించి, తన ఆధ్వర్యంలో నడుస్తున్న దేవరకొండ ఫౌండేషన్ కార్యకలాపాలపై వచ్చిన విమర్శలపై విజయ్ దేవరకొండ ఇటీవల ఓ వీడియో ద్వారా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తెలుగు సినీ పరిశ్రమ మొత్తం విజయ్‌కు అండగా నిలబడింది. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్… ఇలా అన్ని విభాగాలకు చెందిన ప్రముఖులు విజయ్‌కు మద్దతునిస్తూ ట్వీట్ చేశారు. వెబ్‌సైట్స్ వల్ల తాము కూడా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నామంటూ కొందరు సినీ ప్రముఖులు ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ విషయంపై తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్పందించింది. విజయ్ దేవరకొండపై గ్రేట్ ఆంధ్రా వెబ్సైట్ రాసిన ఆర్టికల్ చూసి చాలా షాక్ అయ్యామని, కొన్ని వెబ్‌సైట్స్, యూ ట్యూబ్ ఛానల్స్ తమ ఇష్టానుసారం వార్తలను స్ప్రెడ్ చేస్తున్నాయని, అవి సెబ్రిటీస్ని మానసికంగా కుంగదీస్తున్నాయని కౌన్సిల్ పేర్కొంది. తాజాగా విజయ్ దేవరకొండ తన ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవల గురించి గ్రేట్ ఆంధ్రా వెబ్సైట్ తన ఇష్టానుసారం వార్తలు రాసింది. విజయ్ చేస్తున్న సేవలను కించపరిచే విధంగా గ్రేట్ ఆంధ్రా కథనం కొనసాగింది. గ్రేట్ ఆంధ్రా ఎప్పుడూ బ్లాక్‌మెయిలింగ్ ధోరణిలోనే వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అభిప్రాయపడింది.
గ్రేట్ ఆంధ్రా అనే వెబ్సైట్/పేపర్ నిర్వహిస్తున్న వ్యక్తి యుఎస్ఎ నుంచి తన కార్యకలాపాలు కొనసాగించేవారు. అమెరికాలోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దానికి సమ్మతించకపోవడంతో ఇండియా వచ్చి బెంగళూరు నుంచి వెబ్‌సైట్‌ను రన్ చేస్తున్నారు. గ్రేట్ఆంధ్రా పేపర్ ఓ ప్రముఖ దినపత్రిక కార్యాయంలో ప్రింట్ అవుతుంది. తెలుగు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా తాలూకు రివ్యూ కోసం ఈ వెబ్సైట్ బ్లాక్‌మెయిలింగ్ చేస్తుందని, వారు డిమాండ్ చేసిన అమౌంట్ ఇవ్వకపోతే సినిమా గురించి చాలా బ్యాడ్‌గా రాయడమే కాకుండా తక్కువ రేటింగ్ ఇస్తారని, తద్వారా నిర్మాత ఎంతో నష్టపోతున్నాడని కౌన్సిల్ తెలియజేసింది.
తాజాగా విజయ్ దేవరకొండ చేస్తున్న సేవలపై రాసిన కథనానికి స్పందించిన విజయ్ దేవరకొండ ఓ వీడియోను విడుద చేయడంతో టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది. విజయ్‌కు అండగా నిలబడింది.
ఇటీవల తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.. పిఆర్ఓలతోనూ, వెబ్‌సైట్స్ యాజమాన్యాలతోనూ, సినిమా రిపోర్టర్లతోనూ సమావేశమై వెబ్‌సైట్స్‌లో వస్తున్న ఫేక్ న్యూస్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఎక్స్ప్లెయిన్ చెయ్యాలని అనుకుంది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల అది సాధ్యం కాలేదు.
ఫైనల్‌గా విజయ్ దేవరకొండ నిర్వహిస్తున్న దేవరకొండ ఫౌండేషన్‌పై గ్రేట్ ఆంధ్రా రాసిన తప్పుడు కథనాలను తాము ఖండిస్తున్నామని, విజయ్ దేవరకొండకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలియజేసింది.













