సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను దాటేసిన రెబల్‌స్టార్ ప్రభాస్!
బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా మార్కెట్ అంతర్జాతీయంగా విస్తరించింది. దీంతో తెలుగు సినిమా రేంజ్ కూడా పెరిగింది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన మొదటి టాలీవుడ్ సినిమా బాహుబలి. ఈ సినిమా తర్వాత పలు దక్షిణాది సినిమాలు ప్యాన్ ఇండియా సినిమాలుగా రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ హీరోలకు డిమాండ్ కూడా బాగా పెరిగింది. తమ రెమ్యునరేషన్లను కూడా బాగానే పెంచారు. బాహుబలికి 30 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకున్న ప్రభాస్ ఆ తర్వాత చేసిన సాహోకి 100 కోట్లు తీసుకున్నాడు. అయితే సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడం, నిర్మాతలు అతని స్నేహితులే కావడంతో 30 కోట్లు డిస్కౌంట్ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా తన పారితోషికాన్ని 100 కోట్ల రూపాయలకు ఫిక్స్ చేశాడు ప్రభాస్. రాధేశ్యామ్ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి 100 కోట్లు తీసుకుంటున్నాడు. 70 కోట్లు చెక్ కాగా, 30 కోట్లు రీమేక్ రైట్స్కింద తీసుకుంటున్నాడు. అంటే మొత్తం 100 కోట్లు. ఇప్పటివరకు సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా రజనీకాంత్‌కి పేరు ఉంది. ఒక సినిమాకి 60 కోట్ల నుంచి 70 కోట్ల వరకు తీసుకుంటాడు రజనీ. ఇప్పడు ప్రభాస్ ఈ విషయంలో రజనీకాంత్‌ని దాటేశాడు.
టాలీవుడ్లో మిగతా హీరోల పారితోషికాల గురించి చెప్పుకోవాల్సి వస్తే.. ప్రభాస్ తర్వాత అత్యధికంగా పారితోషికం తీసుకునే హీరో అవుతాడు. అతను ఇప్పడు ఒక సినిమాకి 40 నుంచి 50 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. మహేష్ తర్వాత ఎన్టీఆర్, రామ్‌చరణ్, పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్, విజయ్‌దేవరకొండ, నాని, నాగచైతన్య…ఆ వరసలో ఉన్నారు. అయితే ఒకప్పుడు వీరందరి కంటే పవన్‌కల్యాణ్ పారితోషికం ఎక్కువగా ఉండేది. కానీ, ఈమధ్యకాలంలో పవన్ సినిమాలేవీ చేయకపోవడం, అంతకుముందు చేసిన సినిమాలు వరసగా ఫ్లాప్ అవ్వడం కూడా అతని పారితోషికం తగ్గడానికి కారణమైంది. అందుకే ఒకేసారి నాలుగైదు ప్రాజెక్ట్స్ ఓకే చేసుకొని వచ్చే ఎన్నికల లోపు కొన్ని సినిమాలు ప్రేక్షకులకు అందించాలన్న ఆలోచనతో ఉన్నాడు పవన్ కల్యాణ్.













