Pooja Hegde: ఆడిషన్ ఇవ్వడానికి రెడీ అంటోన్న పూజా
గత రెండేళ్లుగా సౌత్‌లో ఒక్క సినిమా కూడా చేయని పూజా హెగ్డే(Pooja Hegde) ఈ మధ్య కొన్ని కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇండస్ట్రీలోకి హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరని, హీరోలను ఒకలా హీరోయిన్లను ఒకలా ట్రీట్ చేస్తుంటారని చెప్పిన పూజా ఇప్పుడు మరోసారి దర్శకనిర్మాతలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజా మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
హీరోలను ఒక్కో సినిమాలో ఒక్కోలా చూపిస్తూ వాళ్ల కోసం కొత్త కొత్త పాత్రలను డిజసైన్ చేసే డైరెక్టర్లు హీరోయిన్లను మాత్రం ఎప్పుడూ ఒకేలా, ఒకే రీతిలో చూపిస్తున్నారని ఇది కరెక్ట్ కాదని పూజా అంటోంది. సినిమాలో హీరోయిన్ ను సెలెక్ట్ చేసే ముందు ఆ సినిమాకు ఆమె సరిపోతుందా లేదా అనే విషయాన్ని ఆడిషన్ చేసి డిసైడ్ చేయాలని పూజా అభిప్రాయపడుతుంది.
అలా కాకుండా డైరెక్టర్ కు మనసులో ఈ హీరోయిన్ బావుంటుందిలే అనుకుని సినిమాను అనౌన్స్ చేసి ఆ తర్వాత ఆ క్యారెక్టర్ కు ఆమె సెట్ అవలేదని వేరే వాళ్లను తీసుకోవడం కరెక్ట్ కాదని, సినిమాలో ఎవరి పాత్రనైనా ఆడిషన్ చేసే సెలెక్ట్ చేయాలని, అప్పుడే వారు ఆ పాత్రకు ఎలా న్యాయం చేస్తారనేది తెలుస్తోందని పూజా అంటోంది. అంతేకాదు తాను ఎన్ని సినిమాలు చేసినా ఆడిషన్ ఇవ్వడానికి రెడీ అని కూడా పూజా చెప్తోంది.













