గుంటూరు కారంకు పొలిటికల్ టచ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా గుంటూరు కారం. మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మీనాక్షి చౌదరి సెకండ్ లీడ్‌గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కేవలం ఫ్యామిలీ ఎలిమెంట్స్‌కు కట్టుబడకుండా, ఊహించని అంశాలను చాలానే త్రివిక్రమ్ పొందుపరిచాడని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా గుంటూరు కారంలో పొలిటికల్ టచ్ కూడా ఎక్కువగానే ఉంటుందని ఇన్సైడ్ టాక్. ఈ టాక్ కు బలమైన ఆధారం కూడా వినిపిస్తోంది.
గుంటూరు కారం సినిమాలో ప్రకాష్ క్యారెక్టర్ పేరు వైర వెంకట స్వామి అని, 80 ఏళ్ల వయసున్న పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నాడని, జనదళం పార్టీకి ప్రకాష్ రాజ్ ప్రధాన కార్యదర్శిగా అన్ని వ్యవహారాలు చక్కదిద్దే వ్యక్తిగా నటిస్తున్నాడని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ కు ప్రత్యర్థిగా జగపతి బాబు జాలి దయా లేని పరమ దుర్మార్గుడిగా కనిపించననున్నాడని, వీరిద్దరి మధ్య జరిగే యుద్ధంలో మహేష్ ఎందుకొచ్చాడనేదే కీలక పాయింట్ గా త్రివిక్రమ్ స్టోరీని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాదు ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందని, ఆవిడకు ప్రత్యేక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందని టాక్ వినిపిస్తుంది. సినిమా మొత్తం గురూజీ ఫార్మాట్ లోనే నడిచినా కమర్షియల్ యాంగిల్ ఎక్కడా మిస్ అవకుండా ఉంటుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. ఇప్పటికే పలు వాయిదాలతో షూటింగ్ లేట్ అవుతూ వచ్చిన గుంటూరు కారం సినిమాను ఎలాగైనా సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ గట్టిగా ట్రై చేస్తున్నారు.













