24 గంటలు గడువిస్తున్నా….పవన్
తన తల్లిపై వ్యాఖ్యలు చేసిన, చేయించిన వారిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ లో బైఠాయించిన పవన్ కళ్యాణ్ చివరకు 24 గంటల గడువును మా ముందు ఉంచారు. అంతలోపున చర్యలు తీసుకోకపోతే తాను మరోసారి పోరాటానికి దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్..అతడితో పాటు పవన్ తల్లి, సోదరుడు నాగబాబు, మెగా హీరోలు రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్ ఈరోజు ఫిల్మ్ ఛాంబర్లో వెళ్ళి నిరసనను వ్యక్తం చేశారు.
మెగా అభిమానులు కూడా ఫిల్మ్ చాంబర్ కు వేలాది గా తరలివచ్చారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. తోపులాట జరిగింది. గందరగోళంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక టి వి ఛానల్ ఓబి వ్యాన్ ను ధ్వంసం చేశారు.. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.. పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం ఉండటంతో పోలీస్ అధికారులు పవన్ తో చర్చలు జరిపారు..ఫిల్మ్ చాంబర్ నుంచి వెళ్లిపోవాలని, లేదంటే పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉందని ఆయనకు సూచించారు.. దీంతో పవన్ తోపాటు మెగా ఫ్యామిలీ మొత్తం వెళ్లిపోయింది. ఇక తనకు 24 గంటల్లో తగిన న్యాయం చేయాలని ఫిల్మ్ చాంబర్ ను పవన్ కళ్యాణ్ కోరారు.













