నివేదా పరువు ఎలా ఉందంటే..
ఈ మధ్య చిన్నా పెద్దా అనే తేడా లేకుండా నటీనటులంతా వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. అవి ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. వాటిలో పరువు సిరీస్ కూడా ఒకటి. సుస్మిత కొణిదెల నిర్మాణంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇటీవలే రిలీజైంది. నివేదా పేతురాజ్ ఇందులో కీలక పాత్ర పోషించగా నాగబాబు, నరేష్ అగస్త్య సపోర్టింగ్ పాత్రల్లో నటించారు.
పవన్ సాదినేని పర్యవేక్షణలో రాజశేఖర్, సిద్దార్థ్ నాయుడు కలిసి ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. వేరే కులానికి చెందిన నరేష్ అగస్త్యను పెళ్లి చేసుకుందని నివేదాని కుటుంబ సభ్యులు దూరం పెడతారు. కొన్నేళ్ల తర్వాత పెదనాన్న చనిపోయాడని తెలిసి తీసుకెళ్లడానికి వచ్చిన తన బావ సునీల్ కొమ్మిశెట్టితో కలిసి భర్తతో పాటూ ఊరికి బయలుదేరుతుంది పల్లవి.
మధ్యలో అనుకోకుండా సునీల్ చనిపోతాడు. ఆ శవాన్ని దాచడం కోసం పల్లవి, సుధీర్ పడే పాట్లతో సిరీస్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. దృశ్యం లాగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రాసుకున్న ఈ సిరీస్ మొదట కాస్త స్లోగా స్టార్ట్ అయినప్పటికీ అసలు కథ మొదలయ్యాక వేగం పుంజుకుంది. టూ గుడ్ అనేలా లేకపోయినా బోర్ కొట్టించకుండా తీయడంలో డైరెక్టర్లు సక్సెస్ అయ్యారు. టైమ్ ఉండి, క్రైమ్ థ్రిల్లర్లు ఇష్టపడే వాళ్లు పరువును హ్యాపీగా చూసేయొచ్చు.













