‘ఊరంతా అనుకుంటున్నారు’ ప్రీ రిలీజ్ వేడుక
నవీన్ విజయ్‌కృష్ణ హీరోగా బాలాజీ సానల దర్శకత్వంలో శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్.రెడ్డి నిర్మించిన చిత్రం ఊరంతా అనుకుంటున్నారు. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణ మాట్లాడుతూ విజయనిర్మల మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. నవీన్ అంటే ఆమెకు చాలా ఇష్టం. అతను మంచి నటుడు కావాలన్నది ఆమె కోరిక. ట్రైలర్ చూశాను. నవీన్ నటన బావుంది. అతను భవిష్యత్తుల్లో మంచి చిత్రాలు చేయాలి అని అన్నారు. స్టార్డమ్ వెనక పడకుండా నేను మంచి నటుడిగా నిరూపించుకోవాలని నానమ్మ విజయనిర్మల కోరిక. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నానమ్మ కోరిక తీర్చడానికి కష్టపడతాను. ఆమె స్ఫూర్తితోనే నేను టెక్నీషియన్ అయ్యాను. ఊరంతా అనుకుంటున్నారు తో నటుడిగా నిరూపించుకుంటా అని నవీన్ విజయ్‌కృష్ణ తెలిపారు. చక్కని కుటుంబ కథా చిత్రమిది. కె.ఎం.రాధాకృష్ణన్ అద్భుతమైన పాటలు సమకూర్చారు అని దర్శకుడు అన్నారు. ఈ నెల ఐదో తేదీన సినిమా విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. దిల్ రాజు, నరేశ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.













