సినీ నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. బాకీ చెల్లించే నిమిత్తం ఇచ్చిన చెక్కు చెల్లని కేసులో ఒంగోలు రెండో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ పి.భానుసాయి జైలు శిక్ష, జరిమానా విధించారు. జెట్టి వెంకటేశ్వరు అనే వ్యక్తికి బండ్లగణేష్ రూ.95 లక్షలు చెల్లించాల్సి ఉండగా, అందుకు సంబంధించి నగదును చెక్ రూపంలో ఇచ్చారు. వెంకటేశ్వర్లు ఆ చెక్‌ను నగదుగా మార్చుకునే నిమిత్తం బ్యాంకుకు తీసుకెళ్లగా ఖాతాలో నగదు లేకపోవడంతో అది కాస్తా బౌన్స్ అయ్యింది. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్ నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఏడాది జైలు శిక్ష రూ.95.10 లక్షలు జరిమానా వేశారు. జరిమానాలోని రూ.95 లక్షలను ఫిర్యాదికి పరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చారు. ఈ తీర్పును అప్పీలు చేసుకునేందుకు కోర్టు నెలరోజుల గడువు ఇచ్చింది.













