OG: నమ్మకాన్ని నిజం చేసి ‘ఓజీ’ సినిమాకి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు- చిత్ర బృందం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓజాస్ గంభీరగా గర్జించిన చిత్రం ఓజీ (OG). సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24 రాత్రి నుంచి ప్రత్యేక షోలతో ఓజీ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను మునుపెన్నడూ చూడని విధంగా దర్శకుడు సుజీత్ చూపించిన తీరుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, సుజీత్ దర్శకత్వ ప్రతిభ, తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం, రవి కె చంద్రన్, మనోజ్ పరమహంసల కట్టిపడేసే కెమెరా పనితనం కలిసి.. ఓజీని హాలీవుడ్ స్థాయి చిత్రంగా మలిచాయి. అభిమానులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం, తమ సంతోషాన్ని పంచుకుంది.
దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ.. “దాదాపు మూడేళ్ళ ప్రయాణం. మొదటి రోజు నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ, మా పక్కనే ఉంటూ మాకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసిన నిర్మాతలు దానయ్య గారికి, కళ్యాణ్ గారికి కృతఙ్ఞతలు. ఓజీ కథకి ఇంతటి భారీతనం రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి మొదటగా థాంక్స్ చెప్పుకోవాలి. నేను ఆయనకు వీరాభిమానిని. జానీ సినిమా సమయం నుంచి పవన్ గారిని కలిస్తే చాలు అనుకునేది. అలాంటిది ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం, దానికి బ్లాక్ బస్టర్ టాక్ రావడం చాలా ఆనందంగా ఉంది. తమన్ గారు, నవీన్ నూలి గారు, రవి చంద్రన్ గారు ముగ్గురూ ఈ సినిమాకి మూడు పిల్లర్లు లాంటివారు. వారి వల్లే సినిమా ఇంత గొప్పగా వచ్చింది. ముఖ్యంగా తమన్ గారు అందరికంటే ఎక్కువగా ఈ సినిమాని నమ్మారు.” అన్నారు.
సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. “విడుదలకు ముందు సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నాము. మా నమ్మకం నిజమై.. విజయం సాధించిన తర్వాత.. భయం, బాధ్యత పెరిగాయి. ఈ విజయంతో భవిష్యత్ లో మరింత బాధ్యతగా పని చేస్తాం. ఓజీ సినిమా మాది కాదు. ప్రజలు దీనిని ఓన్ చేసేసుకున్నారు. ఎక్కడ చూసినా ఓజీ హంగామానే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారికి ఉండే పవర్ అది. ఇక ముందు కూడా ప్రేక్షకులకు ఏం కావాలో అది ఇవ్వడానికి మరింత బాధ్యతగా పని చేస్తాం. సుజీత్ నా సోదరుడు లాంటివాడు. రెండేళ్లు కలిసి ప్రయాణం చేశాం. కథ విన్నప్పుడే.. ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందని అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి కథలో, ఈ తరహా పాత్రలో చూడాలనేది నాలాంటి ఎందరికో డ్రీమ్. ఓజీ సినిమాతో చాలా చాలా సంతోషంగా ఉన్నాం. ముందుగా ఈ సినిమా పట్టాలెక్కడానికి కారకులైన త్రివిక్రమ్ గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఆయన వల్లే ఇది సాధ్యమైంది.
పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పని చేయడం అనేది డ్రీమ్. నాకు త్రివిక్రమ్ గారితో పని చేయడానికి వంద సినిమాలు పట్టింది. అలాగే పవన్ గారితో పని చేయడానికి కూడా వంద సినిమాలు పట్టింది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజీ ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ గారికి సినిమాలకు పని చేసే అవకాశం రావడం అనేది చిన్న విషయం కాదు. నటుడిగా ఆయనను అభిమానిస్తాను, నాయకుడిగా గౌరవిస్తాను. ఆయన 21 సీట్లకు 21 సీట్లు గెలిచి, డిప్యూటీ సీఎం అయ్యి ఎంత హై ఇచ్చారో.. ఇప్పుడు ఓజీకి వస్తున్న స్పందన చూసి మేము అదే హైలో ఉన్నాము. రెండు నెలల ముందు ఓజీ కాపీ చూసినప్పుడే ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని మేమంతా నమ్మాము. మేము పెద్దగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించకపోయినా.. అభిమానులు ఈ సినిమాని బాగా ఓన్ చేసుకున్నారు. నేను స్వరపరిచిన పాటలకు వారి నుంచి వచ్చిన స్పందన మరిచిపోలేను. నీ వెనుక మేమున్నాం అంటూ దానయ్య గారు, కళ్యాణ్ గారు మొదటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేశారు. నవీన్ నూలిది, నాది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. నవీన్ ఈ సినిమాకి పని చేయడం అదనపు బలం. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇది అభిమానుల విజయం. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ప్రియాంక మోహన్ ఎమోషనల్ అయ్యారు. ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.” అన్నారు.
నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ.. “ఆనందంలో మాటలు కూడా రావడంలేదు. నేను మొట్ట మొదటిగా థాంక్స్ చెప్పాల్సింది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు.. దర్శకుడు సుజీత్ పేరు త్రివిక్రమ్ గారే సూచించారు. త్రివిక్రమ్ గారు లేకపోతే ఈ సినిమా లేదు, నాకు ఇంత పెద్ద విజయం వచ్చేది కాదు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు నచ్చే సినిమా అందించాలనే ఉద్దేశంతో ఎంతో శ్రద్ధతో ఈ సినిమా చేశాం. సుజీత్ తో రెండున్నరేళ్ళకు పైగా ప్రయాణం చేశాను. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఎన్నో రోజులు నిద్ర కూడా మానుకొని ఈ చిత్రం కోసం పనిచేశాడు. సుజీత్ చెప్పినట్టు.. తమన్, నవీన్ నూలి, రవి చంద్రన్ గారు ముగ్గురూ ఈ సినిమాకి మూడు పిల్లర్లు. వీళ్ళు కూడా పగలు రాత్రి అనే తేడా లేకుండా సినిమా కోసం కష్టపడ్డారు.
ఓజీ బ్లాక్ బస్టర్ అవుతుందని తమన్ నమ్మకంగా చెప్పేవాడు. ఇప్పుడు అభిమానుల స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది. సినిమాలో పవన్ కళ్యాణ్ గారి లుక్, యాక్షన్ చూసి నేనే ఆశ్చర్యపోయాను. తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. ఏఎస్ ప్రకాష్ గారి ఆర్ట్ వర్క్ బాగుంది. డైరెక్షన్ డిపార్ట్ మెంట్, మా మేనేజర్స్ చేసిన కృషిని మరిచిపోలేను. అలాగే నాగవంశీ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. నిజానికి ఓజీ అనే టైటిల్ ను ఆయన రిజిస్టర్ చేసుకున్నారు. కానీ, మా కోసం ఆ టైటిల్ ఇచ్చేశారు. ఓజీ టైటిల్ సినిమాకి ఎంతో హెల్ప్ అయింది. విడుదలకు ముందు అభిమానులు ‘ఓజీ ఓజీ’ అంటూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారు. ఇప్పుడు సినిమా విడుదలై, వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేయడం సంతోషంగా ఉంది.” అన్నారు.
కథానాయిక ప్రియాంక మోహన్ మాట్లాడుతూ.. “మీ అందరికీ ఓజీ సినిమా నచ్చిందని అనుకుంటున్నాను. ఓజీ కోసం అందరూ ఎంతగానో ఎదురు చూశారు. ఇప్పుడు థియేటర్ లో సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తమన్ చెప్పినట్టు అందరూ ఈ సినిమాని ఓన్ చేసుకున్నారు. ఓజీకి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇంతకు మించి ప్రేక్షకుల నుంచి మేము ఏం కోరుకుంటాం. మా సినిమాని ఇంతలా ఆదరిస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. ఓజీ సినిమాని అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. నిజంగానే ఈ సినిమాకి ఆ అర్హత ఉంది. డీవీవీ బ్యానర్ లో నాకిది రెండో సినిమా. వరుసగా రెండో విజయం దక్కడం సంతోషంగా ఉంది. అలాగే, తమన్ గారితో నాకిది మొదటి సినిమా. నా కెరీర్ లో ఇది బెస్ట్ ఆల్బమ్. కన్మణి పాత్ర పోషించే అవకాశం ఇచ్చిన సుజీత్ గారికి థాంక్స్. పవన్ గారితో కలిసి నటించడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను.” అన్నారు.
ప్రముఖ నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “తమన్, నవీన్ తో మేము ఎక్కువగా సినిమాలు చేస్తుంటాం. అలాగే నిర్మాతగా కళ్యాణ్ ఇంతటి భారీ సినిమా చేశాడు. అందుకే టీంకి అభినందనలు తెలపడం కోసం ఇక్కడికి వచ్చాను. ఈ సినిమా పంపిణీలో మేము కూడా భాగమే. ఓజీ సినిమా చూసి, మా 12 ఏళ్ళ ఆకలి తీర్చారు అంటూ అభిమానులు చెబుతుంటే సంతోషంగా ఉంది. సుజీత్ కి, తమన్ కి, నవీన్ కి వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ స్క్రీన్ మీద కనిపించింది. ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి.” అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత కళ్యాణ్ దాసరి, ఎడిటర్ నవీన్ నూలి తదితరులు పాల్గొని సినిమాకి వస్తున్న స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు.