వార్2 కు తారక్ ఎంత తీసుకుంటున్నాడంటే?
హృతిక్ రోషన్తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమాలో నటిస్తున్నాడన్న వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మామూలు రచ్చ చేయట్లేదు. ఎవరూ ఊహించని ఈ కాంబినేషన్ తెరపైకి రావడంతో మీడియా మొత్తం ఈ న్యూస్ కు బాగా ప్రాధాన్యత ఇచ్చింది. హృతిక్, తారక్ కలిసి తెరపై కనిపిస్తే ఫ్యాన్స్ సీట్లలో కూర్చోవడం కష్టమేనని మాట్లాడుకుంటున్నారు.
అయితే ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీలో నటించడానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనేదే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న మాట. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అతి పెద్ద మొత్తం రెమ్యూనరేషన్ అందుకుంటున్న టాప్ 5 స్టార్స్ లో ఉన్న ఎన్టీఆర్ కేవం రెమ్యూనరేషనే వంద కోట్లు తీసుకుంటున్నాడు. ఇప్పుడు వార్ 2 కోసం ఎన్టీఆర్ కు 30 కోట్లు ఆఫర్ చేసినట్లు టాక్. మరి ఇది స్పెషల్ క్యారెక్టరా లేక 100 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చి ఫుల్ లెంగ్త్ రోల్ చేయిస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో క్యామియోల రూపంలో చాలా మంది స్టార్స్ కనిపించనున్నారని ఇప్పటికే బాలీవుడ్ మీడియాలో పలు ఛానల్స్ న్యూస్ రన్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తో ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ కు వార్ 2 సినిమా హిట్ అయితే తన స్టార్డమ్ నెక్ట్స్ లెవల్ కు వెళ్లడం ఖాయం.
ప్రస్తుతం కొరటాల శివతో తన 30వ సినిమా చేస్తున్న ఎన్టీఆర్, ఆ తర్వాత ప్రశాంత్ నీల్తో ఓ సినిమా కమిటైన విషయం తెలిసిందే. అయితే ప్రశాంత్ నీల్ కంటే ముందే వార్2 పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో ఇది ఫస్ట్ స్ట్రెయిట్ ఫిల్మ్ కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు.













