నటి నగ్మాకు కరోనా పాజిటివ్

ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మాకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించడంతో తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని, ఈ పరీక్షలో తనకు పాజిటివ్ వచ్చిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం తాను ఐసోలేషన్‍లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు ఆమె వెల్లడించారు. ఇటీవలి కాలంలో తనతో సన్నిహితంగా మెలిగినవారు, తనతో కాంటాక్టులో ఉన్నవారు విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 2న ఆమె కరోనా మొదటి డోసు టీకా తీసుకున్నారు. నగ్మా బాలీవుడ్‍లోనే కాకుండా, టాలీవుడ్‍లోనూ సుపరిచితమే. తెలుగులో ప్రేమికుడు చిత్రంతో బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్రహీరోలతోనూ నటించి మెప్పించారు.