విడాకుల నేపథ్యమున్న కథతో చైతూ?
థాంక్యూ, కస్టడీ సినిమాలతో దారుణమైన డిజాస్టర్స్ అందుకున్న నాగచైతన్య తన తర్వాతి సినిమాను గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో చేయనున్న విషయం తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు అల్లు అరవింద్. మత్స్యకారుల బ్యాక్ డ్రాప్ తెరకెక్కనున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రూపుదిద్దుకోనుంది.
ఈ సినిమా కోసం తండేల్ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా, ఈ మూవీ రంగస్థలం, ఉప్పెనను మించిన సినిమా అవుతుందని యూనిట్ సభ్యులు బలంగా చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత చైతూ ఎవరితో సినిమా చేయనున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారగా, అందులో మొదటి పేరుగా డైరెక్టర్ రామ్ అబ్బరాజు పేరుంది.
రీసెంట్ గా శ్రీ విష్ణుతో సామజవరగమన సినిమా చేసిన రామ్ అబ్బరాజు రీసెంట్గా చైతూని కలిశాడని, తనకు ఓ స్టోరీ చెప్పాడని తెలుస్తోంది. విడాకుల చుట్టూ డిఫరెంట్ కథతో ఈ సినిమా కథ నడవనుందని, ఈ సినిమా కూడా సామజవరగమన లానే ఆద్యంతం వినోదభరితంగా సాగనుందని ఇన్సైడ్ టాక్. కానీ సమంతతో విడాకులయ్యాక తాను చేయబోయే సినిమాల మీద సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ రాకూడదని చైతూ నిర్ణయించుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే రామ్ అబ్బరాజుకు కథలో కొన్ని మార్పులు చేసుకునిరమ్మని చెప్పాడని టాక్ వినిపిస్తోంది. ఫైనల్ వెర్షన్ తో చైతూ ని మెప్పిస్తే తన తర్వాతి సినిమాకు అబ్బరాజుకు లైన్ క్లియర్ అయినట్లే. ఎలాగూ చైతూ చందూ మొండేటి సినిమా పూర్తి చేసేసరికి ఆరేడు నెలలు టైమ్ పడుతుంది కాబట్టి రామ్ అబ్బరాజుకు ఎక్కువ టైమే ఉంది. మరి చైతూ చెప్పిన మార్పులను చేసి ఆ డైరెక్టర్ తనని మెప్పిస్తాడా లేదా చూడాలి.













