పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న నాగ్100
చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న నాగార్జునకు నా సామిరంగ ఫలితం మంచి ఊరటనిచ్చింది. ఈ సినిమా కూడా గొప్ప మూవీ ఏం కాదు కానీ సంక్రాంతి సీజన్ కావడంతో సినిమా గట్టెక్కింది. ఆఖరికి నాగార్జున అకౌంట్ లో మరో సక్సెస్ చేరింది. నా సామిరంగ సక్సెస్ ఇచ్చిన జోష్ తో నాగ్ వరుసగా సినిమాలు చేయబోతున్నాడు.
ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నాగ్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇందులో నాగ్ పాత్ర హీరో పాత్రకు ధీటుగా ఉంటుందని టాక్. దీంతో పాటూ వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేసి నాగ్ మరో సినిమా చేయాలని చూస్తున్నాడు. నాగ్ చేయబోయే ఆ సినిమా బంగార్రాజుకు సీక్వెల్ గా ఉండొచ్చు లేదంటే మరో కొత్త కథతో అయినా రావొచ్చు.
ఇదిలా ఉంటే నాగ్ తన వందో సినిమా పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొదట్లో నాగ్ వందో సినిమా దర్శకత్వ బాధ్యతలను మోహన్ రాజాకు అప్పగించారని వార్తలొచ్చాయి కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో నవీన్ అనే యంగ్ డైరెక్టర్ చేరాడని తెలుస్తోంది. తమిళంలో మూడర్ కూడం అనే సినిమాతో ఆకట్టుకున్న నవీన్, నాగ్ కోసం ఓ భారీ స్టోరీని రెడీ చేశాడని, ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ఇతర భాషల నటీనటులు కూడా నటించనున్నట్లు సమాచారం. తమిళ స్టార్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్ లో ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్సుంది.













